రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా ధారూరులో జరిగిన ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల.. ఉచిత పథకాల(Free Schemes)పై తన అభిప్రాయాన్ని వెల్లడి చేశారు. ఉచితాలు అందరికీ కాకుండా, నిజంగా అర్హులకే పరిమితం చేయాలన్నారు. గతంలో బియ్యం ధర కిలోకు రూ.3 ఉన్నప్పుడు ఎన్టీఆర్ సబ్సిడీ బియ్యం పథకం ద్వారా ప్రజల అభిమానం పొందారని, ఇప్పుడు కిలో బియ్యం రూ.60 ఉన్న సమయంలో ఉచితంగా ఇవ్వడం ఆర్థికంగా తగదన్నారు.
J & K : కశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాద సహచరుల అరెస్టు
రాష్ట్రంలో సుమారు కోటి పది లక్షల కుటుంబాలుండగా, రేషన్ కార్డుల సంఖ్య కోటి పాతిక లక్షలకు చేరిందని వివరించారు. ఇది అనుమానాస్పదమని పేర్కొన్నారు. నిజంగా బియ్యం కొనలేని స్థితిలో ఉన్న కుటుంబాలకు మాత్రమే బియ్యం ఉచితంగా ఇవ్వాలని, కానీ రేషన్ ద్వారా బియ్యం తీసుకుని అమ్మే వారికి ఈ ప్రయోజనం కల్పించరాదని స్పష్టం చేశారు. ఇలా చేయడం వలన ప్రభుత్వ వనరుల వృథా కూడా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, తుమ్మల కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకాన్ని ఎలా అందించాలన్న దానిపై ప్రజలు, రైతులు తమ సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలన్నదే తాను కోరుకునేది అన్నారు. తుమ్మల వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజాధికారాలు, ప్రభుత్వ వనరుల సమర్థ వినియోగం అంశాల్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర పాలనపై కొత్త దృష్టిని విపులంగా విప్పుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.