Site icon HashtagU Telugu

PM Modi : అధికారం కోసం కాంగ్రెస్‌ రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటుంది: ప్రధాని

Congress is using the Constitution as a weapon to seize power: PM

Congress is using the Constitution as a weapon to seize power: PM

PM Modi : హరియాణాలోని హిస్సార్ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ఈ విమానాశ్రయం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ను గుర్తు చేసుకుంటూ.. ఆయన పాటించిన విధానాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేస్తున్న నిరసనలపై ప్రధాని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్‌ రూల్స్‌ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు. దేశ ప్రజల కోసం ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అధికారం పొందేందుకు ఒక సాధనంగా వాడుకుంటోందని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశారని దుయ్యబట్టారు.

Read Also: Djembe Therapy: ఆనందం, ఆహ్లాదం అందించే జెంబే థెరపీ.. ఎలా ?

అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటూ.. ఓటు బ్యాంకు వైరస్‌ను వ్యాప్తి చేసిందని అన్నారు. ముస్లింలకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు వారికి పార్టీలో ఉన్నత స్థానాలను ఇవ్వలేదని ప్రశ్నించారు. ముస్లిం అభ్యర్థులకు 50 శాతం ఎన్నికల టిక్కెట్లను ఎందుకు రిజర్వ్ చేయలేదని నిలదీశారు. రాజ్యాంగ విలువల గురించి ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ వాటిని పాటించలేదని అన్నారు.

కాగా, వక్ఫ్‌ సవరణల చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇది 14, 25, 26 ఆర్టికల్స్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఆందోళనల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు అదుపుతప్పడంతో 110 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, పార్లమెంట్‌ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ చట్టం, 2025 ఇటీవల అమల్లోకి వచ్చింది. కాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం 15 పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్‌ 16న విచారణ జరపనుంది.

Read Also: Banglades : యూనస్‌ను హెచ్చరించిన షేక్ హసీనా