తెలంగాణ రాజకీయాల్లో రైతు సంక్షేమం ప్రధాన అంశంగా మారింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతుల సమస్యలపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నెల 8వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 11 గంటలకు ముఖాముఖీ చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. 72 గంటల గడువు ఇచ్చిన కేటీఆర్, రైతుల కష్టాలు, బీఆర్‌ఎస్ పాలనలో అమలైన పథకాలు, కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించారు.
Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్‌రావు
కేటీఆర్ వ్యాఖ్యల్లో ప్రధానంగా రైతులకు ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, రైతు బీమా, మిషన్ కాకతీయ వంటి పథకాలతో కేసీఆర్ సర్కార్ రైతులకు ఎంతో చేయగలిగిందని హైలైట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మలే తీయగలిగింది తప్ప, నిజమైన సంక్షేమం చేయలేకపోతుందని ఆరోపించారు. రైతు భరోసా బకాయిలు, బోనస్ లేని కొనుగోళ్లు, యూరియా కొరత వంటి అంశాలను ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
కేటీఆర్‌కు మంత్రి అద్దంకి దయాకర్, మంత్రి సీతక్కలు కౌంటర్ ఇచ్చారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కేటీఆర్ సవాళ్లు జనాన్ని ఆకట్టుకోవడం కోసం చేసిన డ్రామాలేనని, అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుండా చర్చకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్‌ను నాయకుడిగా ఎన్నుకున్నారేమో గానీ, బీఆర్‌ఎస్ లో కూడా కేటీఆర్‌కు పూర్తి నాయకత్వ గుర్తింపు లేదన్న వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ బావ, మీ చెల్లి, మీ నాన్న అనే స్థాయిలో మాట్లాడితే ఎవరు మీతో చర్చిస్తారు?’’ అని విమర్శించారు.
CM Revanth Reddy : చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలి : సీఎం రేవంత్‌రెడ్డి
మరోవైపు మంత్రి సీతక్క కూడా కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చించమంటే ప్రెస్ క్లబ్‌కు రావాలనడమేమిటని ప్రశ్నించారు. డెడ్ అయిన పార్టీకి డెడ్ లైన్ పెట్టే స్థితిలో ఉందా బీఆర్‌ఎస్? అని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఉన్న కేటీఆర్‌కు రాష్ట్రంలో ప్రజలు ఏం అనుకుంటున్నారో కనీసం తెలుసుకునే శక్తి లేదన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై కట్టుబడి పనిచేస్తోందని పేర్కొంటూ, అసెంబ్లీలో ఏ అంశమైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ఈ మాటల తూటాలన్నీ తెలంగాణలో రాజకీయ వేడి పెంచుతున్నాయి.