Telangana Politics: తెలంగాణాలో త్వరలో బీసీ గర్జన…

రాష్ట్రంలో త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని, ఈ సభతో బీసీలను ఏకం చేస్తామని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు.

Telangana Politics: రాష్ట్రంలో త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని, ఈ సభతో బీసీలను ఏకం చేస్తామని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ఈ రోజు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, మోడీపై నిప్పులు చెరిగారు. తెలంగాణాలో కెసిఆర్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, త్వరలో బీసీ గర్జనతో కెసిఆర్ మోసాలు బయటపెడతామన్నారు విహెచ్. బీసీ గర్జనకు రాహుల్ గాంధీ అనుమతి వచ్చిందని, ఈ భారీ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆహ్వానిస్తామని తెలిపారు.

కెసిఆర్ తెలంగాణ రైతుల్ని దారుణంగా మోసం చేస్తున్నాడని, ఇందిరా గాంధీ హయాంలో పేదలకు పంచిన భూముల్ని కెసిఆర్ లాక్కుంటున్నాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విఆర్వో వ్యవస్థను రద్దు చేసి మండల కార్యాలయానికి పని లేకుండా చేశాడని సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు విహెచ్. ఇక తెలంగాణాలో రైతులు చనిపోతే పరిహారం ఇవ్వని కెసిఆర్ పంజాబ్ రైతులకు తెలంగాణ సొమ్ముని ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులని దారుణంగా మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

బీసీలకు ప్రధాని నరేంద్ర మోడీ చేసిందేమి లేదని, తెలంగాణాలో బీజేపీ చనిపోయిందని ఎద్దేవా చేశారు విహెచ్. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర బీసీల్లో చైతన్యం వచ్చిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు టిక్కెట్లు కావాలని ఎవరు అడిగినా స్వాగతిస్తామని వి.హనుమంతరావు పేర్కొన్నారు.

Read More: BJP and BJP: కమలం పార్టీలో కుదుపులు.. బీఆర్ఎస్ నేతల్లో ఫుల్ జోష్!