Miss World Competitions : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్‌వరల్డ్ – 2025 పోటీల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అతిథులకు, పోటీల్లో పాల్గొంటున్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. అతిథులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్టు, హోటళ్లు, చారిత్రక కట్టడాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు.
Read Also: Khawaja Muhammad Asif : భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
కాగా, ప్రపంచంలో అతి పెద్ద అందాల వేడుక అయిన మిస్ వరల్డ్ ఫెస్టివల్ -2025 ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చేలా మిస్ వరల్డ్ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పర్యాటక , సాంస్కృతికి శాఖ అధికారులను ఆదేశించారు.
ఇక, ప్రపంచం నలుమూలల నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో తరలిరానున్న అందాల భామలు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలైన చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, రామప్ప, యాదగిరిగుట్ట దేవాలయాలతోపాటు నాగార్జున సాగర్, చేనేత చీరలు నేస్తున్న భూదాన్ పోచంపల్లి ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అందాల రాణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందాల రాణులు తెలంగాణ పర్యాటక కేంద్రాలను సందర్శిస్తే, వీటిపై విదేశీ పర్యాటకుల దృష్టిని ఆకర్షించవచ్చని యోచిస్తున్నారు.
మే 7 నుంచి 31 వరకు హైటెక్స్ వేదికగా జరగబోయే “మిస్ వరల్డ్ 2025” పోటీలను పురస్కరించుకొని, నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భారీ సన్నాహాలు చేపట్టింది. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలతో పాటు చార్మినార్, ట్యాంక్‌బండ్, రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా LED విద్యుత్ దీపాలు, థీమ్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, అలాగే ప్రపంచ సుందరి కిరీటం ఆకారంలో నమూనాలు ఏర్పాటు చేయనున్నట్లు జీఎచ్ఎంసీ వెల్లడించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో జీఎచ్ఎంసీ సుమారు రూ.1.79 కోట్ల బడ్జెట్‌తో అభివృద్ధి పనులకు నాంది పలికింది.