Kingfisher Beers : యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ లేఖ విడుదల చేసింది. వినియోగదారులు, కార్మికుల వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామన్నారు. సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకు వస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇటీవల యూబీ సంస్థ తెలంగాణలో తమ బీర్ల సరఫరాను ఆపేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ కంపెనీకి చెందిన బీర్ల బ్రాండ్ల నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఇప్పటి వరకూ సరఫరా ఆగిపోలేదు. ఫిబ్రవరి నెల కూడా వస్తాయని ఎక్సైజ్ వర్గాలు ప్రకటించాయి. బీర్ ధరలో 70 శాతం పన్నులే ఉన్నాయని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ అంటోంది. ప్రభుత్వం తమకు రూ.658 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీ కోరితే స్పందించడం లేదని కంపెనీ ఆరోపించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించి కొత్త బ్రాండ్ల బీర్లకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల బినామీ కంపెనీల ద్వారా కొత్త బ్రాండ్లను సరఫరా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బీర్ల కంపెనీకి బకాయిలు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇక కంపెనీ భారీగా రేట్లు పెంచాలని కోరుతోందని తాము వారి డిమాండ్ కు అంగీకరించేది లేదని ప్రజలపై భారం పడేందుకు అంగీకరించబోమని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. కాగా, ప్రభుత్వం ధరల విషయంలో చర్చించేందుకు ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసు మేరకు మద్యం ధరలను సవరించనున్నారు. ఆ కమిటీ .. బీర్ల రేట్లను పెంచితే యూబీ కంపెనీ మరోసారి బీర్ల తయారీని, సరఫరాను ఆపేయాలని ఆలోచన చేసే అవకాశం ఉండదు.
Read Also: AP TG CMs Davos Tour: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఏం చర్చించారంటే?