Central Committee – Medigadda : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేంద్ర జలశక్తి శాఖ స్పందించింది. దీనిపై విచారించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్ననట్లు ప్రకటించింది. తెలంగాణ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో ఈ కమిటీ ఈరోజు సమీక్ష నిర్వహించనుంది. అనంతరం మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించేందుకు ఆరుగురు నిపుణుల కమిటీ వెళ్లనుంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ వద్ద 144 సెక్షన్ విధించారు. నిపుణుల కమిటీ అధ్యయనం చేసి కేంద్ర జలశక్తి శాఖకు(Central Committee – Medigadda) నివేదిక సమర్పించనుంది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది ?
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన 20వ నంబర్ పిల్లర్ ను రాష్ట్ర నిపుణుల బృందం పరిశీలించిందని రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వరులు ఆదివారం సాయంత్రం వెల్లడించారు. 20వ నంబర్ పిల్లర్ అడుగున్నర మేర కుంగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నిర్మించిందని, మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. నెలరోజుల్లోగా మరమ్మతు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దీనిపై మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది.