Site icon HashtagU Telugu

Vanamahotsava Program: నేడు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

Vanamahotsava Program

Vanamahotsava Program

Vanamahotsava Program: తెలంగాణ CM రేవంత్ రెడ్డి నేడు (జులై 7) వనమహోత్సవ కార్యక్రమాన్ని (Vanamahotsava Program) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మొక్కలు నాటడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా, 63 ఎకరాల విస్తీర్ణంలో అగ్రి బయోడైవర్సిటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించనున్నారు. ఈ అగ్రి బయోడైవర్సిటీ పార్క్ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా పరిశోధనలను ప్రోత్సహించడానికి రూపొందించబడింది.

ఈ పార్క్ రాష్ట్రంలో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందించడంతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలకు తలమానికంగా నిలుస్తుందని భావిస్తున్నారు. వనమహోత్సవం ద్వారా రాష్ట్రంలో హరిత కవచాన్ని పెంచే లక్ష్యంతో, ఈ సంవత్సరం 18.02 కోట్ల మొక్కలు నాటాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే స్థలం కొరత కారణంగా ఈ లక్ష్యాన్ని 16.06 కోట్లకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Mahesh Babu: సూపర్ స్టార్ మ‌హేశ్‌బాబుకు మ‌రోసారి నోటీసులు!

సీఎం రేవంత్ రెడ్డి గతంలో ‘మా కే నామ్ ఏక్ పెడ్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని ద్వారా విద్యార్థులు తమ తల్లుల పేరిట మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కల నాటడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అగ్రి బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. వనమహోత్సవం రాష్ట్రంలో పర్యావరణ సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడే ఒక ముఖ్యమైన చర్యగా నిలుస్తుంది.