తెలంగాణ అసెంబ్లీ వేదికగా అక్రమ మైనింగ్ అంశం రాజకీయ సెగలు రాజేసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమ మైనింగ్ వ్యవహారాలపై సీబీసీఐడీ (CBCID) విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన సభలో స్పష్టం చేశారు. ముఖ్యంగా రాఘవ కన్ స్ట్రక్షన్స్, గంగుల మరియు వద్దిరాజు కంపెనీల మైనింగ్ కార్యకలాపాలతో పాటు సిరిసిల్ల ఇసుక మాఫియాపై కూడా లోతైన విచారణ జరిపిస్తామని ప్రకటించారు. మైనింగ్ లీజుల కేటాయింపులో జరిగిన లోపాలపై నిగ్గు తేల్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు.
మంత్రి పొంగులేటిపై విమర్శలు
రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంత్రిపై బురద చల్లాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఎవరికీ లొంగదని, ఇప్పటికే రాఘవ కన్ స్ట్రక్షన్స్ నుండి మైనింగ్ శాఖ జరిమానా వసూలు చేసిందని ఆయన వివరించారు. ఈ చర్యలు ప్రతిపక్షాల ఫిర్యాదుల వల్ల కాకుండా, ప్రభుత్వం స్వయంగా తీసుకున్న నిర్ణయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారని, సీబీసీఐడీ విచారణతో అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సీఎం వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థ మంత్రి పొంగులేటిది కాదని చెప్పడం పచ్చి అబద్ధమని, ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సదరు కంపెనీ డైరెక్టర్లుగా పొంగులేటి సతీమణి మాధురి, కుమారుడు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డి ఉన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. రాఘవ అనేది స్వయానా పొంగులేటి తండ్రి పేరు అని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానాలు చెబుతోందని, డైవర్షన్ పాలిటిక్స్ మానేసి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
