తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బడ్జెట్ చర్చ హోరాహోరీగా సాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ).. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మధ్య మాటల యుద్ధం నెలకొంది. కేటీఆర్ కక్ష సాధింపు పాలన జరుగుతోందని విమర్శించగా, రేవంత్ తక్షణమే కౌంటర్ ఇచ్చారు. నిజంగా తాను కక్ష సాధించాలనుకుంటే కేసీఆర్ కుటుంబం (KCR Family ) మొత్తం జైల్లో ఉండేవారని, కానీ ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రతీకారాలకు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తనపై అన్యాయంగా కేసులు పెట్టారని, న్యాయవ్యవస్థను మేనేజ్ చేసి తనను హింసించారని గుర్తు చేశారు.
రేవంత్ భావోద్వేగ వ్యాఖ్యలు
సీఎం రేవంత్ తన అరెస్టును గుర్తుచేస్తూ తనపై అన్యాయంగా డ్రోన్ కేసు పెట్టారని తెలిపారు. మామూలుగా అయితే స్టేషన్ల బెయిల్ ఇచ్చే కేసులో, తనను 16 రోజులు తీవ్రవాదుల కోసం ఉన్న డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారని ఆరోపించారు. అంతే కాకుండా, తన కుమార్తె పెళ్లికి కూడా వెళ్లనీయకుండా భారీగా లాయర్లను రంగంలోకి దింపారని వివరించారు. తన కుటుంబం ఎంతటి మానసిక క్షోభ అనుభవించిందో గుర్తుచేస్తూ, అప్పుడు తనపై జరిగిన అన్యాయాన్ని ప్రతీకారం తీర్చుకునే అవకాశం తనకు ఉన్నా కూడా, తాను అలా చేయడం లేదని చెప్పడం గమనార్హం.
బీఆర్ఎస్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం
ప్రస్తుతం తనకు అధికారం ఉన్నా, ప్రతీకారం కోసం దాన్ని ఉపయోగించకూడదనే సంయమనం పాటిస్తున్నానని సీఎం రేవంత్ అన్నారు. తమ పార్టీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తాను, తన కుటుంబాన్ని తిట్టినా కూడా తాను సహనంతోనే వ్యవహరిస్తున్నానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ కుటుంబం కోసం చర్లపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని అన్న తన మాటను ఎవరూ గుర్తుపెట్టుకోవడం లేదని, తాను దేవుడి న్యాయంపై నమ్మకం ఉంచానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం రోజే ఆసుపత్రిలో చేరడం తాను చేసిన వ్యాఖ్యలతో ముడిపడి ఉందని సూచిస్తూ, బీఆర్ఎస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయ్యింది.