CM Revanth Reddy: హైదరాబాద్‌లో CREDAI నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని, ప్రభుత్వం పారదర్శక విధానాలను అనుసరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా నిర్మాణ రంగం ఒక ముఖ్యమైన గ్రోత్ ఇంజిన్‌గా పనిచేస్తుందని సీఎం అభివర్ణించారు.
అపోహలను తొలగిస్తూ స్పష్టమైన హామీ
పాలకులు మారినప్పటికీ పాలసీల్లో ఎలాంటి పెరాలసిస్ ఉండదని, దానివల్లే ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అలాంటి ప్రచారాలకు లొంగితే రియల్ ఎస్టేట్ రంగం నష్టపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ అపోహలను తొలగించడానికే తాను ఈ కార్యక్రమానికి వచ్చానని సీఎం చెప్పారు.
Also Read: Sudarshan Chakra : స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయబోతున్న భారత్
“పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. కేవలం పెట్టుబడులకు రక్షణ కల్పించడం మాత్రమే కాదు. అవి లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత కూడా మా ప్రభుత్వానిది. విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్న మేము, మన రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎలా వదులుకుంటాం?” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
తనను తాను సగటు మధ్యతరగతి ఆలోచనలున్న ముఖ్యమంత్రిగా అభివర్ణించుకున్న రేవంత్ రెడ్డి, ప్రజల శ్రేయస్సు కోసమే తాను ఆలోచిస్తానని స్పష్టం చేశారు. “కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్న వాడిని కాదు” అని పేర్కొన్నారు. అందుకే మీరు అడిగిన కొన్నింటికి తాను అంగీకరించకపోవచ్చని, కానీ పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధికి ఎప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనుచితమైన డిమాండ్లకు తాను మద్దతు ఇవ్వనని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.
