Site icon HashtagU Telugu

Rajiv Gandhi Statue: నేడు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్

Rajiv Gandhi Statue

Rajiv Gandhi Statue

Rajiv Gandhi Statue: సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు, ఇతర పార్టీ నేతలు పాల్గొననున్నారు. సచివాలయం ముందు 2 ఎకరాల విస్తీర్ణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాస్తవానికి రాజీవ్ గాంధీ జయంతి నాడే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలి. కానీ కుదరలేదు. దీంతో ఈ రోజు సాయంత్రం ముహూర్తం ఫిక్స్ చేశారు. కాగా ఈ కార్యక్రమానికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలిరానున్నారు. ఇప్పటికే జిల్లాల నుంచి నేతలందరూ హైదరాబాద్ వచ్చేశారు. మంత్రులు, కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా ఈ విగ్రహ ప్రతిష్టపై బీఆర్ఎస్ అసహనం వ్యక్తం చేస్తుంది.

ఆగస్టులో సచివాలయం(Secretariat) ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రతిష్టించిన విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పడం గమనార్హం. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఈ స్థలాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మొదట కేటాయించిందని కేటీఆర్ వాదిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ తమ పార్టీ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా మారుస్తామని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖుల పేర్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాలకు బీఆర్‌ఎస్ పేరు మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ అహంకారానికి, అస్తిత్వానికి విఘాతం కలిగించే చర్య అని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తుందని, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కూడా బీఆర్‌ఎస్ పేరు మారుస్తుందని, తెలంగాణకు చెందిన ఓ ప్రముఖుడి పేరును పెడతామని ఆయన అన్నారు.

ఉద్యమం పేరుతో తెలంగాణను దోచుకున్న వారి విగ్రహాలు సచివాలయం ముందు పెట్టరాదని కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. సచివాలయం నుండి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి దాని స్థానంలో మీ తండ్రి విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారా అని కేసీఆర్ ని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. సచివాలయం ముందు తాగుబోతులకు, దొంగలకు చోటు లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పదేళ్లుగా ఎందుకు ఆలోచించలేదని బీఆర్‌ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: Minister Sridhar Babu Vs KTR : కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్