తెలంగాణలో (Telangana) రాజకీయ విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పేరుతో ఖర్చైన నిధులపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harishrao )ను తీవ్రంగా విమర్శించారు. హరీష్ రావు తాటిచెట్టులా ఎదిగినప్పటికీ, ఆయనకు ఆలోచనా శక్తి లేదని, ఆయన చెప్పే మాటలు ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధం లేకుండా ఉంటాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి, ప్రాజెక్టులపై చర్చ చేయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. లక్ష కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడు ఏళ్లలోనే వైఫల్యం చెందిందని, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని వ్యాఖ్యానించారు.
Pawan Kalyan : ‘జనసేన’ కాదు ‘మత సేన’ అంటూ షర్మిల ఫైర్
తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని, నేటి నీటిపారుదల వ్యవస్థ వెనుక కాంగ్రెస్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టుల కృషి ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం.. ప్రజా పాలన సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, దేవాదుల, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని, బీఆర్ఎస్ తన పాలనలో కొత్తగా ఏమి చేయలేదని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చించేందుకు కేసీఆర్ ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నిస్తూ, ప్రజలకు నిజమైన విషయాలు తెలియజేయాలంటే ఈ అంశంపై చర్చ అవసరమని పేర్కొన్నారు.