CM Revanth Reddy : పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర రియాక్టర్ పేలుడు ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనిఖీ చేశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఆయన, అక్కడి అధికారులు, కలెక్టర్‌తోపాటు పరిశ్రమ ఉన్నతాధికారులతో క్షుణ్ణంగా వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల అనంతరం వెంటనే బంధువులకు అప్పగించాలని సీఎం స్పష్టం చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పరిశ్రమ శాఖ అధికారులతో తీవ్రంగా చర్చించారు.
ప్రమాదం జరిగిన పరిశ్రమలో బాయిలర్లను, ఇతర భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారా? బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి ముందస్తుగా హెచ్చరించారా? గతంలోనూ ఇలాంటి ఘటనలు సంభవించాయా? అనే ప్రశ్నలు సీఎం అధికారులను ఉద్దేశించి వేశారు. అయితే వారు సరైన వివరాలు ఇవ్వలేకపోవడంతో, ఊహాగానాల ఆధారంగా సమాధానాలు ఇవ్వొద్దని తీవ్రంగా హెచ్చరించారు.
ప్రమాదంపై నిపుణుల కమిటీ వేయాలని, ఇప్పటికే పరిశీలన చేసిన అధికారుల్ని కాకుండా కొత్త అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదికను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు. కంపెనీలో పనిచేసిన కార్మికులకు జీవిత బీమా ఉందా? అనే అంశంపై వివరాలు కోరారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఇతర పరిశ్రమలన్నింటిలోనూ భద్రతా ప్రమాణాలపై సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చే విధంగా నిబంధనలను అమలు చేయాలని చెప్పారు.
CM Chandrababu : అనుకూలించని వాతావరణం.. తిరిగొచ్చిన సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్