Bathukamma Kunta: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులతో సమీక్షించారు. ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బతుకమ్మ కార్యక్రమంతో పాటు 26న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న బతుకమ్మ కుంట (Bathukamma Kunta) కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం
అంబర్ పేట్‌లో ప్రభుత్వం పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26న ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో హాజరు కానున్నందున, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులను సీఎస్ ఆదేశించారు. సాయంత్రం 4 గంటల నుండే మహిళలు చేరుకునే అవకాశం ఉన్నందున శానిటేషన్, బందోబస్తు, తాగునీటి సదుపాయం వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Also Read: Railway Employees: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. బోనస్ ప్రకటించిన కేంద్రం!
గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం బతుకమ్మ ఉత్సవం
ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేలకు పైగా మహిళలు పాల్గొంటారని సీఎస్ తెలిపారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, స్టేజి ఏర్పాట్లు, విద్యుదీకరణ, శానిటేషన్ వంటి ఏర్పాట్లు చేయాలని రామకృష్ణా రావు స్పష్టం చేశారు.
Also Read: Smartphones: పాత స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
ఇతర కార్యక్రమాలు
టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. 27న ట్యాంక్ బండ్ పై సాయంత్రం బతుకమ్మ కార్నివాల్, 29న పీపుల్స్ ప్లాజా, 30న ట్యాంక్ బండ్ పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
