Site icon HashtagU Telugu

CM Revanth Reddy : రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం.. కేరళలో రగల్చిన రేవంత్ రెడ్డి..!

Let's develop Telangana with Rising 2047: CM Revanth Reddy

Let's develop Telangana with Rising 2047: CM Revanth Reddy

CM Revanth Reddy : కేరళలోని అలెప్పీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ ని ప్రశంసిస్తూ, తెలంగాణ, కేరళలో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి, అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్‌ను పేదల , అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడే నాయకుడిగా అభివర్ణించారు. వేణుగోపాల్ 2006లో ప్రారంభించిన పొంథువల్ మెరిట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ అవార్డులు 10వ , 12వ తరగతి విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ ఏడాది దాదాపు 3,500 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారని తెలిపారు.

కేరళను ‘దైవ భూమి’గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, విద్యకు ఆ రాష్ట్రం ఇస్తున్న ప్రాధాన్యతపై ప్రశంసలు కురిపించారు. దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచిందని, అక్కడ అమలవుతున్న వయోజన విద్యా కార్యక్రమం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కేరళ విద్యారంగంలో సాధించిన విజయాలను చూసి తనకు అసూయ కలిగిందని అన్నారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. అధికారంలోకి వచ్చిన కేవలం 55 రోజుల్లోనే 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. రాబోయే కాలంలో 100 నియోజకవర్గాల్లో ఒక్కోదానికి ₹200 కోట్లతో, 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మించబోతున్నామని ప్రకటించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని వివరించారు.

Mahesh Babu : గౌతమ్ పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేశ్ బాబు

రాబోయే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో కృషి చేస్తున్నామని, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాని ఛైర్మన్‌గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను నియమించామని వెల్లడించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళను తమ నియోజకవర్గంగా ఎంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్ద ఉద్యమం చేస్తుందని అన్నారు. ప్రతి భారతీయుడి ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడటానికి అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పిస్తే, నరేంద్ర మోదీ ఆ హక్కును కొల్లగొడుతున్నారని ఆరోపించారు. యువత రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని కోరారు. 21 ఏళ్ల యువత ఐఏఎస్‌లుగా జిల్లాలను సమర్థవంతంగా నడిపిస్తున్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. ఈ దిశగా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రెండు శక్తుల మధ్య జరుగుతున్న పోరాటంలో యువత తేడాను గమనించాలని సూచించారు. ఆర్థిక బలం, మీడియా మద్దతు లేకపోయినా, యువతలోని శక్తిని నమ్ముకొని కాంగ్రెస్ పోరాడుతోందని, కాంగ్రెస్ యువత హక్కులను పరిరక్షిస్తుందని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. యువతే తమ నమ్మకం, బ్రాండ్ అంబాసిడర్లని చెబుతూ, తమ భవిష్యత్తు కోసం, దేశం కోసం పోరాడాలని రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ముగించారు.

Mohammed Azharuddin : కాంగ్రెస్ సడన్ మూవ్.. అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ గిఫ్ట్ ఎందుకు?