బిఆర్ఎస్ (BRS) సహా తాను ఎవరి బెదిరింపులకు భయపడనని ..నేను భయపడితే ఇంత దూరం రాను. పుట్టింది, పెరిగింది నల్లమల్ల అడవుల్లో. పులులను చూశా. అడవిలో ఉండే మృగాలను చూశా. తోడేళ్లను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా. మానవ మృగాలు మీరెంత? నా కాలు గోటితో సమానం అంటూ మహబూబ్నగర్లో రైతు పండుగ (Rythu Panduga) ముగింపు వేడుక లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు.
పాలమూరు జిల్లాపై బిఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ, కపట ప్రేమ చూపిస్తున్నారని..’నేను ఇక్కడ పుట్టినోడ్ని. పోతే ఈ మట్టిలో కలిసేటోడ్ని. సీఎంగా ఉండి నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, నిధులు, నీళ్లు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ జిల్లాకు నిధులు తెస్తా. నీళ్లు పారిస్తా. కొడంగల్లో పారిశ్రామవాడను తెచ్చి 25వేల ఉద్యోగాలు ఇప్పిస్తా’ అని రేవంత్ వెల్లడించారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్ అంటే, ఇప్పుడు తాము వరి పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని ..ఇది చూసి బిఆర్ఎస్ నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. ఏడాదిలోపే 25 లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. అన్నదాతలకు ఉచిత కరెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎంపీగా ఉండి మహబూబ్ నగర్ జిల్లాకు కెసిఆర్ ఏం చేశారో చెప్పాలి’ అని రేవంత్ డిమాండ్ చేశారు.
లక్ష కోట్లతో పాలమూరు రాత మారుస్తామనన్న రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పెద్దల మాయలో పడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. భూసేకరణను అడ్డుకోవద్దని, పాలమూరు బిడ్డ సీఎంగా ఉండీ.. ఈ జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర తనను క్షమించదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉండి, పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే లక్ష కోట్లు ఖర్చు చేస్తే, ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని విమర్శించారు. మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసొప్పలేదని మండిపడ్డారు. ఎవరెవరో వచ్చి మన జిల్లాను దత్తత తీసుకుంటామని అన్నారని వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.
లగచర్ల భూసేకరణ విషయంలో బిఆర్ఎస్ మాటలు నమ్మి రైతులు కేసుల్లో ఇరుక్కోవద్దని సీఎం రేవంత్ అన్నారు. అమాయకులను రెచ్చగొట్టి దాడులు చేయించారని ఆయన ప్రతిపక్షాన్ని విమర్శించారు. ఇకపై జిల్లాకు ఏటా రూ.20వేల కోట్లు కేటాయిస్తామన్నారు. గతంలో ప్రాజెక్టులకు భూసేకరణ చేయలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు తాము ఇలాగే అడ్డుకుంటే ప్రాజెక్టుల నిర్మాణ పూర్తయ్యేదా అని అడిగారు. ఈ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల కోసం రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం ఇంకా సొమ్ము అయినా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Read Also : Employee Issues : జీవో 317పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ