Site icon HashtagU Telugu

CM Revanth Reddy Counter : ప్రధాని మోడీకి సీఎం రేవంత్ కౌంటర్..

Revanth Counter

Revanth Counter

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని మోడీ (PM Modi) విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పథకాల అమలు, ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ట్వీట్ చేసారు. ‘ఎన్నికల తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తూనే ఉంటుంది. తాము ఎన్నటికీ అమలు చేయలేమని తెలిసినా హామీలు ఇస్తారు. కానీ, ఈసారి ప్రజల ముందు ఘోరంగా బయటపడ్డారు’ అని మోడీ ట్వీట్ చేశారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా చూడండి. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారాయి. బ్యాడ్ నుంచి వరెస్ట్‌కు చేరాయి. వాళ్లు ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరలేదు. ఆ రాష్ట్రాల ప్రజలు భయంకరంగా మోసపోయారు. ఇలాంటి రాజకీయాల వల్ల బలయ్యేది సామాన్యులే. పేదలు, యువకులు, రైతులు, మహిళలు ఈ వాగ్దానాల ప్రయోజనాలను పొందలేకపోవడమే కాదు.. వారికి ఇప్పటికే అందుతున్న పథకాలను కూడా నీరుగార్చే దుస్థితి వచ్చింది’ అని పేర్కొన్నారు.

‘సాధ్యంకాని వాగ్దానాలను చేయడం సులభమే కానీ.. వాటిని అమలు చేయడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రహిస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ వాళ్లు అసాధ్యమైన హామీలను ఇస్తున్నారు. అసాధ్యమని తెలిసినా వాగ్దానాలు చేస్తున్నారు’ అంటూ ప్రధాని వరుస ట్వీట్స్ చేసారు.

ఈ ట్వీట్స్ కు తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై, మా ప్రభుత్వంపై మీరు చేసిన ప్రకటన సరికాదని, మీ విమర్శల్లో వాస్తవిక లోపాలు ఉన్నాయని, అందుకే నేను వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నానని సీఎం పేర్కొన్నారు. బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ప్రజలు ఇబ్బందులు పడినట్లు విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన హామీలు చూడండి..

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు: తెలంగాణ రాష్ట్రంలోని మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం అందించి, 101 కోట్లకు పైగా ప్రయాణాలు నిర్వహించారని, దీని వల్ల మహిళలు రూ.3,433.36 కోట్లు ఆదా చేసుకున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీ పథకంలో రూ.10 లక్షల బీమా కవరేజీ అందిస్తూ, ప్రజల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేశామని చెప్పారు.

రైతుల రుణమాఫీ: 22,22,365 మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, ఇప్పటికే రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు రేవంత్ వెల్లడించారు. దీనివల్ల రైతులు అప్పుల భారంతో కృంగిపోకుండా జీవనం సాగించగలుగుతున్నారని తెలిపారు.

ఉచిత విద్యుత్: ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు.

సబ్సిడీ గ్యాస్ సిలిండర్: తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధరను రూ.500గా నిర్ణయించి, రాష్ట్రంలోని 42,90,246 కుటుంబాలకు ఉపశమనం కల్పించామని చెప్పారు.

ఉద్యోగ అవకాశాలు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 50,000 ఉద్యోగాలను అందించామన్నారు. విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ కేటాయింపులు 40 శాతం పెంచినట్లు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ: మూసీ నదికి పునరుజ్జీవం కల్పించడం, చెరువులను రక్షించడం, వాటిపై ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవడం వంటి పర్యావరణ పరిరక్షణ పనులను కూడా ప్రస్తావించారు.

ఇతర అభివృద్ధి కార్యక్రమాలు: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని అన్నారు.

Read Also : Caste Census : కులగణన సర్వేకు సర్వం సిద్ధం చేసిన రేవంత్ సర్కార్ ..