Pocharam Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్‌!

  • Written By:
  • Updated On - June 21, 2024 / 12:15 PM IST

Pocharam Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని (Pocharam Srinivas Reddy) కలిసి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ‘ఆకర్ష్’ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే సీఎం రేవంత్‌ రెడ్డి కోరిక మేరకు మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.

Also Read: Pocharam Srinivas Reddy : కాంగ్రెస్ లోకి పోచారం..?

పోచారం చేరిక తర్వాత సీఎం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసాం. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తాం. రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నాం. భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం అని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ తెలిపారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమ రాజ్యం.. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతామని సీఎం రేవంత్‌ చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలో పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వదంతుల నేపథ్యంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పోచారంతో పాటు మరికొందరు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో పాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై పోచారం శ్రీనివాస్ రెడ్డి 23,464 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో 2019 జనవరి నుంచి 2023 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1984లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 27 ఏళ్లు టీడీపీలో ఉన్న ఆయన పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఈ చేరికలపై అటు బీఆర్ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ కానీ.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేదా ఎమ్మెల్యే హరీష్‌ రావు స్పందించకపోవటం గమనార్హం. ఇప్పటికే పార్టీతో ఉండేవాళ్లు ఉంటారు.. పోయే వాళ్లు పోతారని మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే.