మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్ లో ఉన్న సీఎం రేవంత్..రాష్ట్రంలోని తండావాసులు గుడ్ న్యూస్ తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తండావాసుల జీవితాల్లో వెలుగులు నింపేలా భారీ ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి లంబాడా తండాకు బీటీ రోడ్ల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు సౌకర్యం లేని తండా అంటూ తెలంగాణలో ఎక్కడా ఉండకూడదని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, తాను స్వతంత్ర జడ్పీటీసీగా ఉన్న సమయం నుండి లంబాడా యువత అందించిన మద్దతును ఆయన స్మరించుకున్నారు. ఆ కృతజ్ఞతతోనే తండాల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
తండాల అభివృద్ధి కేవలం రోడ్లకే పరిమితం కాకూడదని, విద్యారంగంలో కూడా విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం ఆకాంక్షించారు. తండాలోని విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందేలా ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. లంబాడా యువత కేవలం తండాలకే పరిమితం కాకుండా, తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తండాల్లో విద్యా ప్రమాణాలను పెంచడం ద్వారా యువతను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.
లంబాడా యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, వారు గ్రూప్-1, గ్రూప్-2 అధికారులతో పాటు డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థానాలను లక్ష్యంగా పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. మారుమూల తండాల నుండి వచ్చిన వారు దేశం గర్వించే స్థాయికి ఎదగాలని, దానికి అవసరమైన పూర్తి సహకారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తామని, తండాల పురోగతి కోసం ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
