Site icon HashtagU Telugu

Minister Seethakka : 22 ఇందిరా మహిళా శక్తి భవనాల లిస్టు రిలీజ్‌

Arogya Lakshmi Scheme

Arogya Lakshmi Scheme

Minister Seethakka : కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో, నవంబర్ 19న వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ఈ భవనాల జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్ల వ్యయంతో మొత్తం రూ.110 కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి జిల్లాకేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ భవనాలను పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తారు. ఆయా జిల్లాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ భవనాల నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఇందిరా మహిళా శక్తి భవనాల్లో మహిళలకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, వారు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణతో పాటు, ఉత్పత్తుల మార్కెటింగ్, కామన్ వర్క్‌షెడ్‌, ఉత్పత్తుల ప్రదర్శనలు, జీవనోపాధి కల్పన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్య‌లు

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా హనుమకొండలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని, సభావేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం అనే పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో ఆరింటిలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని కొండా సురేఖ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు కృషి జరుగుతోందని తెలిపారు.

కులగణన చేపట్టడం శతాబ్దాల తర్వాత జరుగుతున్న అపూర్వ ఘట్టమని, ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. రాష్ట్రం దివాళా తీయించిన పరిస్థితుల్లో కూడా సీఎం రేవంత్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు. మహిళల కోసం ప్రగతి నివేదన సభగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీతక్క తెలిపారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా భవనాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. గత భారాస ప్రభుత్వం పదేళ్లలో 21 లక్షల మందికే రుణమాఫీ చేసినప్పటికీ, తమ ప్రభుత్వం ఒకే ఏడాదిలో 23 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టినా, భారాస, భాజపా పార్టీలు రాజకీయ స్వార్థమే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆక్షేపించారు.

Group-3 Exam: గ్రూప్-3 ఎగ్జామ్‌.. చంటి బిడ్డ‌తో ఒక‌రు, చేతులు లేక‌పోయినా మ‌రొక‌రు!