కృష్ణ వాటర్ (Krishna Water) విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరు పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ (AP) కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు సీఎం. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఏపీ అధిక నీటిని తరలిస్తోందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టెలిమెట్రీ వ్యవస్థను అమలు చేయడం తప్ప మరో మార్గం లేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టెలిమెట్రీ వ్యవస్థ ద్వారా కృష్ణా నదిలో నీటి ప్రవాహాన్ని కచ్చితంగా లెక్కించుకోవచ్చు. అయితే టెలిమెట్రీ వ్యవస్థ కోసం అవసరమైన నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని అధికారుల ద్వారా సీఎం గమనించారు. ఈ వ్యవస్థను అమలు చేయడానికి తెలంగాణ తన వాటా మొత్తం చెల్లిస్తుందని, కేంద్ర జల కమిషన్ దీనిపై జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
MGNREGA Workers : ఏపీలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త
రాబోయే వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తకుండా రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుంచి నీటిని సమర్థంగా విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వేసవిలో తీవ్రమైన వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రైతులకు సాగునీరు నిరంతరాయంగా అందించేందుకు ప్రాజెక్టుల నీటి నిల్వలు గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే తాగునీరు, సాగునీరు అవసరాలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. అంతకు ముందు కృష్ణా నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి అనుమతి ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. గత మూడు నెలలుగా ఏపీ రోజుకు 10,000 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ నుంచి తీసుకుంటోందని, ఇప్పటి వరకు 646 టీఎంసీల నీటిని వినియోగించుకుందని కేటీఆర్ వివరించారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి స్పందించకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు.