Site icon HashtagU Telugu

CM Revanth : జనగాం జిల్లాలో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

Cm Revanth Janagam

Cm Revanth Janagam

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించి రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన (Foundation stone laid for development works worth Rs 800 crore) చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాశక్తి పథకం కింద రూ. 102.1 కోట్లతో మంజూరు చేసిన ఏడు ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి, మహిళల ఆర్థిక స్వావలంబనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం శివునిపల్లిలో జరిగిన ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు.

Potti Sriramulu Statue : అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం – సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించారు. అదనంగా రూ. 12.9 కోట్లతో గోవర్ధనగిరి నుంచి చర్లతండా వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ స్థాయి ఆఫీస్ కాంప్లెక్స్, రూ. 45.5 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, రూ. 5.5 కోట్లతో డిగ్రీ కాలేజీ ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-2లో భాగంగా రూ. 148.76 కోట్లతో ఆర్‌ఎస్ ఘన్‌పూర్ ప్రధాన కాలువ సీసీ లైనింగ్ పనులు, రూ. 25.6 కోట్లతో 750 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు మంజూరు చేశారు.

ప్రజాపాలన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం మహిళలకు సరైన మద్దతు అందించలేదని విమర్శించారు. కేసీఆర్ తన పాలనలో అన్ని రంగాల్లో రుణభారం మిగిల్చి వెళ్లారని, వారి పాలనలో రైతులు, పేదలు తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, వరంగల్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చడంలో తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని వివరించారు. రైతు రుణమాఫీ, అభివృద్ధి పనులు, మహిళా సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన తమ ప్రభుత్వం చేసిన ముఖ్యమైన నిర్ణయాలని తెలిపారు.