CM KCR: ‘యాదాద్రి సంప్రోక్షణ’కు కేసీఆర్!

తెలంగాణలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి పున: ప్రారంభ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించడంతో తిరుమల తిరుపతికి తీసిపోనివిధంగా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది.

  • Written By:
  • Publish Date - March 25, 2022 / 03:55 PM IST

తెలంగాణలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి పున: ప్రారంభ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించడంతో తిరుమల తిరుపతికి తీసిపోనివిధంగా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది. భక్తుల క్యూలైన్స్ మొదలుకొని.. దైవదర్శనం వరకు తిరుమల తరహాలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్చి 28న యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ పునఃప్రారంభించడంలో భాగంగా నిర్వహించనున్న ‘మహాకుంభ సంప్రోక్షణ’లో పాల్గొననున్నారు. ఈ మేరకు ‘మహా కుంభ సంప్రోక్షణ’ నిర్వహణ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలాలయంలో వేద అర్చకులు పంచకుండాత్మక సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో దాదాపు 108 మంది రుత్విక్కులు పాల్గొంటారని సమాచారం.

ముఖ్యమంత్రి రాకను దృష్టిలో ఉంచుకుని యాదాద్రి పట్టణం నుండి కొండ గుడి వరకు కూడా భారీ పోలీసు భద్రతను మోహరిస్తున్నారు. అదే సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ‘మహా కుంభ సంప్రోక్షణ’ ఇతర ఆచారాలు పూర్తయిన తర్వాత మాత్రమే భక్తులను కొండ గుడిపైకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటలకు స్వస్తి వచనంతో ‘పంచకుండాత్మక సుదర్శన యాగం’ పూర్ణాహుతితో ముగుస్తుంది. అయితే ఆలయ సంప్రోక్షణ, పున:ప్రారంభ పనులకు ప్రధాని మోడీ, చినజీయర్ స్వామిలను ఆహ్వానించాలని గతంలో సీఎం కేసీఆర్ భావించారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో ఆ ఇద్దరు యాదాద్రికి వస్తారా? అనేది మాత్రం ప్రశ్నార్థకమే.