KCR Meeting: ఎన్నిక‌ల యుద్ధానికి సిద్ధంకండి: తెలంగాణ భ‌వ‌న్లో కేసీఆర్

ఎన్నిక‌ల యుద్ధానికి సిద్ధం కావాల‌ని ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

  • Written By:
  • Updated On - November 15, 2022 / 05:41 PM IST

ఎన్నిక‌ల యుద్ధానికి సిద్ధం కావాల‌ని ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భ‌వ‌న్లో జ‌రిగిన టీఆర్ఎస్ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశంలో బీజేపీ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. అన‌స‌వ‌ర విష‌యాల్లో త‌ల‌దూర్చ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని క్లాస్ తీసుకున్నారు. క్యాలెండ‌ర్ ప్ర‌కారం ఇక ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ఆదేశించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తి లేదని కూడా ఆయన వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో పాత వారికే సీట్లు కేటాయిస్తామని కూడా ఆయన ప్రకటించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎంపీలు, పార్టీ కీలక నేతలతో 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉందని ఆయ‌న పార్టీ శ్రేణులకు సూచించారు. నేతలంతా పార్టీ విజయానికి గట్టి కృషి చేయాలని ఆయన సూచించారు. అవనసర విషయాల జోలికి వెళ్లరాదన్నారు. ఐటీ, ఈడీ దాడులతో విరుచుకుపడుతున్న బీజేపీ పై పోరాటం కొనసాగించాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీతో ఇక యుద్ధమేనని కూడా ఆయన ప్రకటించారు.

Also Read:  KCR Munugode Formula: 2023 ఎన్నికలపై కేసీఆర్ ‘మునుగోడు’ ఫార్ములా!

తెలంగాణ భ‌వ‌న్లో మంగ‌ళ‌వారం శాస‌న‌స‌భ‌ప‌క్ష‌, పార్ల‌మెంట‌రీ పార్టీ, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. పార్ల‌మెంట్ వెలుప‌ల‌, లోప‌ల ఎలా వ్య‌వ‌హ‌రించాలో ఎంపీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప‌లు వివాద‌స్ప‌ద అంశాల‌ను తీసుకుని మోడీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని సూచించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని పార్ల‌మెంట్ వేదిక‌గా హైలెట్ చేయాల‌ని గైడ్ చేశారు. ఇప్ప‌టికే సిట్ ఇచ్చిన ఆధారాల‌ను సేక‌రించిన ఆయ‌న మ‌రిన్ని అంశాల‌ను క్రోడీక‌రిస్తున్నారు. వాటిని బేస్ చేసుకుని మోడీ స‌ర్కార్ ను ఢిల్లీ వేదిక‌గా దోషిగా నిల‌పాల‌ని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాల‌కు వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాల‌ని పిలుపునిచ్చారు. క్షేత్ర‌స్థాయిలో ఐక్యంగా ప‌నిచేయాల‌ని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల ఫార్ములాను అనుస‌రించాల‌ని గైడ్ చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పేర్కొన్నారు. ఏపీలో మాదిరిగా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డానికి యోచిస్తున్న‌ట్టు సంకేతాలు ఇచ్చారు. మొత్తం మీద ఎన్నిక‌ల ఏడాదిలోకి అడుగు పెట్టామ‌న్న విష‌యాన్ని గ‌మ‌నించి ప‌నిచేయాల‌ని దిశానిర్ధ‌శం చేశారు.

Also Read:  Eatala Grand Offer: ఈటెల‌కు డిప్యూటీ సీఎం ఆఫ‌ర్‌? `గ్రాండ్ ఘ‌ర్ వాప‌సీ`!