Bird Flu Outbreak : ఓ వైపు ఆంధ్రప్రదేశ్.. మరోవైపు తెలంగాణ.. రెండు వైపులా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు ని పశ్చిమగోదావరి జిల్లాల్లో వెలుగు చూసింది. అక్కడ లక్షలాది కోళ్లు చనిపోయాయి. తెలంగాణలో తొలి బర్డ్ ఫ్లూ కేసు యాదాద్రి జిల్లాలో నమోదైంది. ఇప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా మార్చి 8వ తేదీన (శనివారం) మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫాంలలో దాదాపు 10వేల కోళ్లు చనిపోయాయి.మృతి చెందిన కోళ్లను భూమిలో పూడ్చేశారు.
Also Read :Telangana NDA : తెలంగాణలోనూ తెరపైకి ఎన్డీయే కూటమి?
బర్డ్ ఫ్లూ మరణాలు తక్కువే
బర్డ్ ఫ్లూ(Bird Flu Outbreak) భయాల నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో తెలంగాణలో దాదాపు 20వేల కోళ్లు చనిపోయాయని పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించడం గమనార్హం. ఈవిధంగా కోళ్లు చనిపోతున్న జిల్లాల్లో చికెన్ తినేందుకు జనం జంకుతున్నారు. కోడిగుడ్లు కూడా తినడం లేదు. అయితే అన్ని చోట్లా కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ ఒక్కటే కారణం కాదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కొన్నిచోట్ల సరైన మేత లేక కోళ్లు చనిపోయాయని తెలిపారు. ఇటీవలి వాతావరణంలో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల వల్ల పలుచోట్ల కోళ్లు చనిపోయాయన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన కోళ్ల సంఖ్య తెలంగాణలో తక్కువే ఉంటుందన్నారు.
Also Read : 1000 Killed : 2 రోజుల్లో 1000 మంది మృతి.. రోడ్లపై డెడ్‌బాడీలు.. సిరియాలో మళ్లీ నరమేధం
5 శాతం మరణాలు కామన్
పౌల్ట్రీ పరిశ్రమ నిపుణుల కథనం ప్రకారం.. ప్రైవేటు కంపెనీల నుంచి పౌల్ట్రీ రైతులకు కోడిపిల్లలు సప్లై అవుతాయి. ఈ కోడిపిల్లల సంరక్షణ, పోషణకు రైతులదే బాధ్యత. పౌల్ట్రీ ఫామ్‌లలో కోడిపిల్లలు ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్న తర్వాత, వాటిని సదరు ప్రైవేటు కంపెనీలే కొంటాయి. ఇందుకుగానూ ఒక్కో కోడికి సగటున రూ.6 దాకా లభిస్తాయి. ఈ కోడిపిల్లలు పౌల్ట్రీ ఫామ్‌లలో పెరిగే క్రమంలో, వాటిలో దాదాపు 5 శాతం చనిపోతుంటాయి. వివిధ సాధారణ వ్యాధుల వల్ల అవి చనిపోతాయి. కోళ్లకు ఎక్కువగా రాణీఖేత్ వ్యాధి వస్తుంటుంది. కోళ్ల ఫామ్‌లలోని నాలుగైదు శాతం కోళ్లు చనిపోవడం అనేది సర్వసాధారణం. ఒకవేళ 10 శాతం నుంచి 20 శాతం కోళ్లు ఒక్కసారే చనిపోతే, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈమేరకు పౌల్ట్రీ ఫామ్‌ల నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసాధారణ సంఖ్యలో కోళ్ల మరణాలు ఉంటే, తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే చాలాచోట్ల కోళ్లఫామ్‌ల యాజమానుల నుంచి అధికారులకు సమాచారం చేరడం లేదు.