Barrelakka Shirisha : బర్రెలక్క సాహసానికి జేజేలు

శిరీషకు 'బర్రెలక్క' (Barrelakka) అనే పేరు కూడా వచ్చింది. అంతేకాదు శిరీష ఇన్ స్టా ఎకౌంట్ కి 4 లక్షల 34 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

  • Written By:
  • Updated On - November 11, 2023 / 11:39 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Barrelakka Shirisha : అనగనగా ఓ బర్రెలు కాసే అమ్మాయి. ఆ అమ్మాయి పేరు శిరీష. ఆమె తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన దళిత యువతి. డిగ్రీ పూర్తి చేసిన ఆమెకు ఉద్యోగం రాలేదు. నీళ్లు..నిధులు.. నియామకాలు అంటూ రాష్ట్రాన్ని సాధించి పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న వారు తమలాంటి యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం చెందారని ఆమె నిరాశ. అందుకే ఆమె నాలుగు బర్రెలను కొనుక్కొని వాటిని మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగిస్తోంది. తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. తల్లి ఒక కర్రీ పాయింట్ బండితో బతుకుబండి నడుపుతోంది. ఉద్యోగాలు ఎలాగూ దొరకడం లేదని తన జీవనోపాధికి మరో మార్గం లేక బర్రెలను కొనుక్కొని, వాటిని ఆమె ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. మొత్తం సోషల్ మీడియా వేదికలలో నిరుద్యోగ యువతీ యువకుల ద్వారా ఆ వీడియో విపరీత ప్రచారం పొందింది. దీనితో శిరీషకు ‘బర్రెలక్క’ (Barrelakka) అనే పేరు కూడా వచ్చింది. అంతేకాదు శిరీష ఇన్ స్టా ఎకౌంట్ కి 4 లక్షల 34 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ గా ప్రసిద్ధికెక్కింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇది ఒక పేద దళిత అమ్మాయి కథ. కథ బాగానే ఉంది కానీ కథ తిరిగిన మలుపే ఈ అమ్మాయికి గండంగా మారింది. ఈ కథ ఏలిన వారికి కోపాన్ని తెప్పించింది. తనకు ఉద్యోగం రాకపోతే సరే. ఆ మాత్రానికి వీడియో చేస్తుందా! ఆ వీడియో యువతి యువకుల మధ్య ఇంత ప్రచారం పొందుతుందా! అనేది ఆ కోపానికి ఆధారం. సరే పాలకులకు ఆగ్రహం వస్తే అది ఏదో రూపంలో వ్యక్తం కావాలి కదా. అందుకే శిరీష మీద 2022లో పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 505 (2) కింద కేసు నమోదు చేశారు. కులం మతం జాతి పుట్టుక ప్రాంతం తదితర విషయాల పునాదిగా ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రచారం చేయడం నేరం. బర్రెలక్క (Barrelakka) మీద మోపబడిన సెక్షన్లో ఉన్నది ఇదే. అసలే తెలంగాణలో ప్రభుత్వం నిరాశలో ఉన్న యువత నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో బర్రెలక్క లాంటివారు ప్రచారంలోకి వస్తే అది ప్రభుత్వానికి తలనొప్పిగానే మారుతుంది మరి.

రాజుగారికి తలనొప్పి వస్తే దానికి ముందు ఒక మాత్ర రూపంలో ఉండదు. అదెలా ఉంటుందో పోలీసులు చూపించారు. అదే సెక్షన్ 505. “నువ్వు చదువుకుంటే నీకు డిగ్రీ వస్తుంది కానీ ఉద్యోగం రాదు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా రాదు. అలాంటి సమయంలో నేను నా తల్లి దగ్గర నాలుగు డబ్బులు అప్పు చేసి నాలుగు బర్రెల్ని కొనుక్కొని నా జీవనోపాధిగా మార్చుకున్నాను” అని బర్రెలక్క (Barrelakka) సమాధానం చెబుతోంది. దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని శిరీష లాంటి యువతీ యువకులకు ప్రోత్సాహంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సింది. కానీ అలా జరగలేదు. ఒక అల్పప్రాణి మీద అంత పెద్ద బలవంతమైన పాలకవర్గం కక్షపూరితంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. అయితే తాను అల్పప్రాణిని కాదని బర్రెలక్క అనబడే శిరీష నిరూపించింది.

ఎన్నికల బరిలో బర్రెలక్క (Barrelakka)

జీవనోపాధి కోసం నాలుగు బర్రెలను పెంచుకుంటే అదే మహా నేరంలాగా తన మీద పోలీసులు కేసు పెట్టడం బర్రెలక్క శిరీష (Barrelakka Shirisha)కు కోపాన్ని తెప్పించింది. ఆ ఆగ్రహం ఆమెను ఎన్నికల వైపు నడిపించింది. అంత పెద్ద ప్రభుత్వం, చతురంగ బలాలు, బలగాలు ఉన్న ప్రభుత్వం తన మీద పగబడితే వణికిపోయి మూలన కూర్చోలేదు. శిరీష తన ధిక్కార స్వభావాన్ని ప్రపంచానికి మరింతగా చాటాలని నిర్ణయించుకుంది. అందుకే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. నామినేషన్ పత్రాలతో పాటు ఆమె సమర్పించిన అఫిడవిట్లో తనపై ఉన్న కేసును కూడా పేర్కొంది. తాను ఒక పేద దళిత యువతిని అని, తనకు సహాయం లభిస్తే కొన్ని వాహనాలను అద్దెకు తీసుకొని ఎన్నికల ప్రచారం చేయగలనని ఆమె అంటుంది. ఆమె ధైర్యం, సాహసం ఇప్పుడు యువతకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.

ఆమె తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి వంటి హేమాహేమీలను ఢీకొనబోతోంది. ఈ ఎన్నికల్లో బర్రెలక్క విజయం సాధిస్తుందో లేదో అనే మీమాంస ఎవరికీ ఉండదు. ఒక ఉద్యోగమే పొందలేని దౌర్భాగ్య స్థితుల్లో యువత కొట్టుమిట్టాడుతున్న నేపథ్యం నుంచి వచ్చిన సాధారణ పౌరురాలు, డబ్బు, మద్యం, అధికారం పునాదులుగా సాగుతున్న ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోరు. కానీ ఈ పరిస్థితుల్లో అన్ని బలాలనూ బలగాలనూ కేవలం ఒకే ఒక్క ఆత్మబలంతో ఎదుర్కొంటున్న ఈ నిరుపేద దళిత అమ్మాయి సాహసమే, ధిక్కారమే ఒక విజయంగా భావించవచ్చు.

Also Read:  MLC Kavitha: సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదు : ఎమ్మెల్సీ కవిత