Political Game of Thrones : ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని భూముల ధరలు ఇప్పుడు టాప్ రేంజులో ఉన్నాయి. దీంతో ఓ రాజకీయ నేత రంగంలోకి దిగాడు. ఆ జిల్లాల పరిధిలో ఉన్న ఒక విలువైన స్థలంపై కన్నేశాడు. దాన్ని హస్తగతం చేసుకునేందుకు ఆయన భారీ స్కెచ్ గీశాడు. ఈదశలో సదరు రాజకీయ నాయకుడికి షాకిచ్చే ఆకస్మిక పరిణామం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఒక బడా రాజకీయ నాయకుడి సోదరుడు రంగంలోకి దిగాడు. అతడికి శక్తివంతుడైన ఒక రాష్ట్ర మంత్రి మద్దతు సైతం ఉంది. ఈ వ్యక్తి ( బడా రాజకీయ నేత సోదరుడు) ఎంట్రీతో.. అప్పటిదాకా ఆ విలువైన స్థలంపై కన్నేసి కాచుకు కూర్చున్న రాజకీయ నేత ఖంగు తిన్నాడు. తన నోటికాడి ‘కబ్జా’ చేజారిందని కుమిలిపోయాడు. బడా రాజకీయ నాయకుడి సోదరుడి ఆగడాలు ఇలాగే కొనసాగితే తన రాజకీయ ఉనికికే ముప్పు ఉంటుందని ఆ రాజకీయ నేత భావించాడు. తన సత్తా ఏమిటో చూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సదరు రాజకీయ నేత(Political Game of Thrones) ఒక సంపన్న ఎమ్మెల్యేను ఆశ్రయించాడు. సదరు సంపన్న ఎమ్మెల్యే తన ఆర్థిక బలాన్ని ఉపయోగించి అసలైన రాజకీయ డ్రామాకు తెరలేపాడు. ఒక పెద్ద వ్యతిరేక వర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేశాడు.
Also Read :Jimmy Carter : మాజీ దేశాధ్యక్షుడికి గ్రామీ అవార్డ్.. ఇంద్రానూయి సోదరికి కూడా..
నిధులు ఇవ్వనందు వల్లే..
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. సదరు రాజకీయ నేత సూచన మేరకు అప్పటికే అసంతృప్తిగా ఉన్నదాదాపు 24 మందికిపైగా ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు సమాచారం. అలా టచ్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే ఇప్పుడు తత్తరపాటుకు గురవుతున్నారని, ఈ సమావేశం గురించి అడిగితే ఉలిక్కిపడుతున్నారని అంటున్నారు. ఇంతకీ ఆ 24 మందికిపైగా ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఎందుకు ? అంటే.. బడా రాజకీయ నేత సోదరుడికి మద్దతుగా నిలుస్తున్న శక్తివంతుడైన రాష్ట్ర మంత్రి ఉద్దేశపూర్వకంగానే వారికి నిధుల కేటాయింపును అడ్డుకుంటున్నాడు. కేవలం తనకు విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులను విడుదల చేస్తున్నాడు. ఆ భూమి విషయంతో పాటు ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నందుకు సదరు పవర్ ఫుల్ రాష్ట్ర మంత్రిపై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని అంటున్నారు. ఆ మంత్రి పెత్తనాన్ని ఇక సహించేది లేదని ఎమ్మెల్యేలు తేల్చి చెప్పే దాకా పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
Also Read :Gun Firing Case : బత్తుల ప్రభాకర్ టార్గెట్.. రూ.333 కోట్లు, 100 మంది యువతులు..
దాదాపు సగం మంది సమావేశానికి..
మరోవైపు రాష్ట్ర మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలతో సదరు రాజకీయ నాయకుడు ఇటీవలే సమావేశమయ్యాడు.దాని గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఆ రాజకీయ నాయకుడు సంప్రదించిన ఎమ్మెల్యేలలో దాదాపు సగం మంది సమావేశానికి వెళ్లినట్లు తెలిసింది. ఇది సాధారణమైన సమావేశమేం కాదు. ఇందులో పెద్ద సవాల్ ఉంది. సందేశం ఉంది. హెచ్చరిక ఉంది. బడా రాజకీయ నేత సోదరుడి దురహంకారం, పవర్ ఫుల్ రాష్ట్ర మంత్రి పెత్తనానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారనే సందేశం ఈ సమావేశంలో దాగి ఉంది.
హైకమాండ్‌కు నోట్ పంపితే సరిపోతుందా ?
ఈ పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఒక నోట్‌ను తయారు చేసి ఢిల్లీలోని హైకమాండ్‌కు పంపింది. అయితే దీనితో ఈ సమస్యకు పరిష్కారం లభించదు. సదరు మంత్రికి ఉద్వాసన పలికితే తప్ప అధికార పక్షంలో ఏర్పడిన సంక్షోభం సమసిపోదు. అయితే ఆ మంత్రికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. తెలంగాణలో జరిగిన గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పలు కీలక విజయాలను ఆయనే అందించాడు. ప్రత్యేకించి సదరు మంత్రికి సన్నిహితులైన పలువురు నేరుగా పార్టీ హైకమాండ్‌కు చేరువలో కూర్చొని ఉన్నారు.
సంపన్న ఎమ్మెల్యే టార్గెట్ ఏమిటి ?
రాష్ట్ర మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలను కూడగట్టడంలో కీలక పాత్ర పోషించిన సంపన్న ఎమ్మెల్యే విషయానికి వస్తే.. ఆయనకు కూడా ఒక లక్ష్యం ఉంది. ఎలాగైనా రాష్ట్ర మంత్రి కావాలనేది సదరు ఎమ్మెల్యే టార్గెట్. ఈక్రమంలోనే తన బలాన్ని చాటుకునేందుకు యత్నించాడని, అందులో భాగంగానే ఈ రాజకీయ వ్యూహాన్ని అమలుపరిచాడని అంటున్నారు.
అధికార పార్టీకి బలమైన ఎదురుదెబ్బ
మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. ఇది సాధారణ భూకబ్జా వివాదం కానే కాదు. తెలంగాణలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి బలమైన ఎదురుదెబ్బ లాంటి అంశం. దీన్ని ఇక్కడితోనే ఆపేయకపోతే మరింత మంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రేరణగా మారుతుంది. అధికార పార్టీ అంతర్గతంగా చీలిపోతే, భవిష్యత్ రాజకీయాల్లో బలంగా నిలవడం సంక్లిష్టంగా మారుతుంది. పార్టీ హైకమాండ్‌కు కూడా పెద్ద సవాల్‌ను విసురుతుంది.
రాజు తిరిగొచ్చాడా ? సైలెంటుగా పావులు కదిపాడా ?
తెలంగాణలోని అధికార పార్టీలో అలజడి ఏర్పడిన తరుణంలో ఒక కీలకమైన విపక్ష పార్టీలో వేగంగా పరిణామాలు మారాయి. అనుకోకుండా సోషల్ మీడియాలో ఒక పోల్ వచ్చింది. సదరు విపక్ష పార్టీ నేతను జనం తిరిగి కోరుకుంటున్నారనే ముచ్చట ప్రచారంలోకి వచ్చింది. ఆ నేత ఫామ్ హౌస్ నుంచి పాలన సాగించే విషయంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. రాష్ట్రంలోని అధికార పార్టీలో అలజడి రేగుతున్న వేళ.. ఆ విపక్ష పార్టీ బాస్ హుటాహుటిన తన సన్నిహితులతో ప్రైవేటుగా సమావేశమయ్యాడు. సోషల్ మీడియా పోల్ గురించి ఆయన డిస్కస్ చేశాడు. ఇక తమ యాక్టివిటీని మొదలుపెట్టాలని దిశానిర్దేశం చేశాడు. ఆయన కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు.సుదీర్ఘకాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన ఆ విపక్ష పార్టీ బాస్ మాటలను ప్రజలు విన్నారు. ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా విమర్శించాడు. దీంతో సదరు విపక్ష పార్టీ బాస్ సరైన సమయం కోసం వేచి చూశారా ? ఇదే ఆరంభమా ? తన సత్తాను, ప్రభావాన్ని చూపించాలని అనుకున్నారా ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రాష్ట్రంలో కాషాయ పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో సదరు విపక్ష పార్టీ బాస్ యాక్టివేట్ కావడాన్ని కీలకమైన పరిణామంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మంత్రివర్గం నుంచి ఆ ముగ్గురు ఔట్
తెలంగాణ మంత్రి వర్గం నుంచి ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో ఉన్న ఒక మంత్రి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాస్తవ్యులు. మరో మంత్రి (మహిళ) రాజకీయ పార్టీలు మారే విషయంలో చాలా ఫేమస్ అయ్యారు. ఇంకో రాష్ట్ర మంత్రి చాలా సీనియర్. ప్రభావవంతంగా పనిచేయలేదనే ఫీడ్ బ్యాక్ వల్లే ఈ ముగ్గురు మంత్రులు ఉద్వాసన ముప్పును ఎదుర్కొంటున్నారు. అయితే వీరిపై పలు ఫిర్యాదులు కూడా అందాయట. మంత్రి పదవిని కోల్పోయే ముప్పును ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే.. గతంలో సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన ఒక దివంగత మహానేత ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. తర్వాత తెలంగాణ క్రియేటర్‌గా పేరొందిన నేత హయాంలో మంత్రిగా వ్యవహరించారు. అయితేే మంత్రుల తొలగింపుపై అధికార పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రిమండలిలో మొత్తం 18 మంత్రి పదవులు ఉంటాయి. వీటిలో 10 ఇప్పటికే భర్తీ అయ్యాయి. పార్టీలోని నేతల మధ్య వర్గ విభేదాల వల్ల మిగతా మంత్రి పదవుల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రెడ్డి వర్గానికి నాలుగు మంత్రి పదవులు దక్కాయి. సీఎం రేవంత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖ సీఎం పరిధిలోనే ఉంది. మంత్రి వర్గంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. త్వరలో ఓ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. అయితే ఆయనకు కూడా బాగానే పోటీ ఉంది. గత ప్రభుత్వానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. అయితే పార్టీనే నమ్ముకొని ఉన్న సీనియర్లకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లోనూ పలు కీలక పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వాటిని భర్తీ చేస్తేనే, పార్టీ వ్యవహారాలను స్పష్టంగా ముందుకు తీసుకెళ్లే వీలు కలుగుతుంది.
సీఎంకు 2 సవాళ్లు..
ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట రెండు ప్రధానమైన సవాళ్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి తావు ఇవ్వకుండా రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించడం అనేది మొదటి సవాల్. గత ప్రభుత్వం ఫెయిలైన విషయాల్లో.. తన ప్రభుత్వం తప్పకుండా నెగ్గుతుందని నిరూపించుకోవడం రెండో సవాల్. మంత్రివర్గ విస్తరణ అనేది పాలనా పటిమను పెంచేందుకు ఉద్దేశించినది. అందులో ఎలాంటి రాజకీయమూ ఉండదు. అయితే పరోక్షంగా దీని ప్రభావం రాజకీయ సమీకరణాపైనా పడుతుంటుంది. కొందరు మంత్రులపై వేటు పడటమైతే ఖాయం. అయితే ఎవరిపై పడుతుంది అనేది వేచిచూడాలి.
ఆ పోల్‌తో తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్
కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా పేజీలో గత శుక్రవారం అర్ధరాత్రి పోస్ట్ చేసిన ఒక చిన్న పోల్ పెద్ద వివాదానికి దారితీసింది. రాజకీయ దుమారాన్ని క్రియేట్ చేసింది. దీంతో వెంటనే ఆ పోల్‌ను ఆపేయమంటూ నేరుగా సీఎం వద్ద పనిచేసే సీనియర్ అధికారులకు సందేశాలు, కాల్స్ వచ్చాయి. ఆ తప్పుడు పోస్ట్ చేసిన వ్యక్తిని పీకేయమని ఆ సందేశాల్లో కోరారు. ఇంతకీ ఏమిటా తప్పిదం .. అనుకుంటున్నారా ? ఆ పోల్‌లో ‘‘మీకు ఎలాంటి ప్రభుత్వం కావాలి ’’ అనే ప్రశ్నను అడిగారు.. దీనికి సమాధానాలుగా ఏ.ఫామ్ హౌస్ ప్రభుత్వం, బి. ప్రజా ప్రభుత్వం అనే రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఈ పోల్‌లో పాల్గొన్న వారిలో 70 శాతం మంది ఫామ్ హౌస్ పాలన అనే ఆప్షన్‌కే ఓటు వేశారు. ఈ పోల్ ఫలితాన్ని చూసి కాంగ్రెస్ పెద్దలు విస్మయానికి గురయ్యారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో మన్నె సతీశ్ అనే వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటి నుంచే మన్నె సతీశ్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలను చూస్తున్నారు. ఈ పోల్ వ్యవహారంలో ఉన్నవారు ఉద్యోగం కోల్పోతారనే ప్రచారం నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాల గురించి అసహనంగా ఉన్న హైకమాండ్.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక పవర్ ఫుల్ మీడియా సంస్థ అధినేత కుమారుడు, పెద్దపల్లి ఎంపీ జి.వంశీ పేరు తెరపైకి వచ్చింది. ఈయనకు ఒక తెలుగు పత్రిక, న్యూస్ ఛానల్, డిజిటల్ మీడియా ఉన్నాయి. ఈ రేసులో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కూడా ఉన్నారు. ఎవరికి పార్టీ సోషల్ మీడియా పగ్గాలు ఇవ్వాలనే దానిపై సీఎం రేవంత్ తుది నిర్ణయం తీసుకుంటారు. మన్నె సతీశ్ తన అవకాశాన్ని చాలావరకు కోల్పోయినట్టే. నేటి డిజిటల్ యుగంలో ఒక తప్పయినా.. తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఆ పోల్‌లో ప్రజలు ఫామ్‌హౌస్ పాలనకు మొగ్గుచూపడం అనేది పెద్ద ట్విస్టు !!
ఎస్‌పీ బాలసుబ్రమణ్యం విగ్రహం ఏర్పాటు.. బ్యూరోక్రసీలో గడబిడ
దివంగత ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతి పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు ఒక ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది. అందుకయ్యే ఖర్చును తామే భరిస్తామని చెప్పింది. ఈమేరకు సంబంధిత అధికారులకు ఆ సంస్థ విన్నవించుకుంది. దీనిపై అధికారులు ఒక నోట్‌ను తయారు చేసి, అనుమతి కోసం ఉన్నతాధికారులకు పంపారు. అక్కడే అసలు కథ మొదలైంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆ ఫైలుపై సంతకం చేయాల్సిన చోట తన ఇంటిపేరుతో సహా పూర్తిగా రాశారు. అనంతరం ఆ ఫైలును తిప్పి పంపారు. దీన్ని చూసిన సదరు విభాగం అధిపతి.. పూర్తి పేరు కాకుండా సంతకం మాత్రమే చేయాలని సీనియర్ ఐఏఎస్‌కు సూచిస్తూ ఆ నోట్‌ను మళ్లీ వచ్చిన చోటుకే పంపారు. ఆ నోట్‌లో ప్రస్తావించిన భాష సరిగ్గాలేదని, దాన్ని కూడా మార్చేయాలని సూచించారు. కీలకమైన కార్యనిర్వాహక వ్యవస్థలో పైచేయి కోసం జరుగుతున్న పోరును ఈ ఘటనలో మనం చూడొచ్చు. వ్యక్తిగత, రాజకీయ దురుద్దేశం వల్లే సీనియర్ ఐఏఎస్ అధికారి చేసిన సంతకంపై అభ్యంతరం తెలిపారని తెలుస్తోంది. ఈ గందరగోళం నడుమ ఎస్‌పీ బాలసుబ్రమణ్యం విగ్రహం ఏర్పాటు అంశం అటకెక్కింది.