Site icon HashtagU Telugu

Chandrababu : జైలు నుంచే చంద్రబాబు ఆట.. తెలంగాణలో మారిన రాజకీయం

Chandrababu Jail

Chandrababu Jail

తెలంగాణ (Telangana)లో తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగకూడదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) కలిశారు. తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టడానికి జాబితా సిద్ధంగా ఉందని జ్ఞానేశ్వర్ బాబుకు తెలియజేశారు. అయితే బాబు ఇది సమయం కాదని, ఏపీ ఎన్నికలు కీలకమని, వాటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో మన వ్యూహం ఉండాలని జ్ఞానేశ్వర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల ఆట రసకందాయంలో పడిన ఈ సమయంలో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఆట మలుపు తిరగడానికి కారణం అవుతుందని భావించవచ్చు. ఇప్పటికే జనసేన బిజెపి కలిసి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఏపీ (AP)లో టిడిపితో పొత్తులో ఉంది. కానీ తెలంగాణ ఎన్నికల విషయంలో జనసేన టిడిపి (Janasena -TDP)తో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా బిజెపితో జతకట్టడానికి సిద్ధమైంది.

ఇది తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) చాలా ప్రభావం చూపించే నిర్ణయం. ఒకవేళ టిడిపి కూడా బిజెపికి అనుకూలమైన నిర్ణయం తీసుకొని జనసేన, బిజెపితో పాటు టిడిపి కూడా పొత్తులోకి వెళితే అది ఈ కూటమి గెలుపు మాటలా ఉంచి, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీని మలుపు తిప్పే మంత్రాంగం కాగలదు. కానీ అపర చాణుక్యునిగా ప్రసిద్ధి చెందిన చంద్రబాబు తెలంగాణ విషయంలో చాలా తెలివైన ముందు చూపుతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అటు జనసేన బిజెపితో గాని, ఇటు ఒంటరిగా గాని ఎన్నికల్లో దిగకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తప్పనిసరిగా ఫలితాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపించవచ్చు.

చంద్రబాబు ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జనసేన, బిజెపితో కలిసి తెలంగాణ ఎన్నికల పోటీలో ఉంటే, ఆ పొత్తును ఏపీలో కొనసాగించవచ్చు. లేదా ఒంటరిగా పోటీ చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలం ఎంతో నిరూపించుకోవచ్చు. లేదా తటస్థంగా ఉండి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తమ ప్రభావం, బలం ఎలా ఉంటుందో నిరూపించి చెప్పవచ్చు. చంద్రబాబు ఈ మూడో ఆప్షన్ వైపే మొగ్గు చూపినట్టుగా అర్థమవుతుంది. తెలంగాణలో ఇప్పుడు టిడిపి, జనసేన, బిజెపితో కలిసి పోటీ చేసినా లేదా ఒంటరిగా పోటీ చేసినా రెండు మూడు సీట్లు సాధించినా ఆ విజయంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి క్రియాశీలమైన ప్రభావాన్నీ చూపించలేరు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాదులో ఐటీ ఉద్యోగులలో వెల్లువెత్తిన నిరసన ఉద్యమాన్ని నీరుగార్చి అవహేళన చేసి, అణచివేసిన కేటీఆర్ మీద తెలుగుదేశం వర్గాలు చాలా గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసి అధికార బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చినా, అది పరోక్షంగా కాంగ్రెస్ ఓటమికి, బీఆర్ఎస్ విజయానికి దోహదపడుతుంది. అలాంటి పొరపాటు చంద్రబాబు ఎలా చేయగలరు? తన అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలు మారుతున్న రాజకీయ దృశ్యాలు, మలుపు తీసుకుంటున్న కీరకాంశాలు- ఇవన్నీ చంద్రబాబు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అందుకే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన ఓటమికి పరోక్షంగా సహాయపడి, 2018 ఎన్నికల్లో తన తెలంగాణ ఎంట్రీని మహాస్త్రంగా మలుచుకుని గెలుపొంది, ఇప్పుడు తన అరెస్టుపై చెలరేగిన నిరసన జ్వాలలను చల్లార్చే ప్రయత్నాలు చేసి, తన పట్ల పూర్తి శత్రుత్వాన్ని కొనసాగిస్తున్న కెసిఆర్, కేటీఆర్ కుటుంబాన్ని, వారి పార్టీని చంద్రబాబు కలలో కూడా సమర్ధించలేడు. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా సెట్లర్ల ప్రభావం గణనీయంగా ఉంటుందని, ఇప్పుడు లెక్కలు చెబుతున్నాయి. ఒకటి రెండు శాతం ఓట్ల ప్రభావంతో చాలా చోట్ల జయాపజయాలు నిర్ణయించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆంధ్రా సెటిలర్లు, టిడిపి మద్దతు దారులు విశేషంగా ఉన్నారు. వారి ఓట్లు ఎన్నికల్లో చాలా కీలకంగా మారాయి.

ఇప్పటికే టిడిపి మద్దతుదారులు, చంద్రబాబు సామాజిక వర్గ సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని బహిరంగంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కాంగ్రెస్లో చేరి రాజకీయాన్ని మరో మలుపు తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి నుంచి రోజురోజుకు కాంగ్రెస్ వైపు వలసలు ఎక్కువయ్యాయి. కీలక నాయకులు చాలామంది కాంగ్రెస్లో చేరుతున్నారు. బిజెపి మూడో స్థానంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడంలో బీజేపీకి సహాయపడే ఎలాంటి చర్యలు తీసుకున్నా అది ఆత్మహత్యా సదృశం అవుతుందని చంద్రబాబు గమనించారు. ఈ సమయంలో కాంగ్రెస్ గెలవడాని కంటే బీఆర్ఎస్ ఓడిపోవడమే చంద్రబాబుకు చాలా అవసరం.

తనను పరమ శత్రువుగా భావించి నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్, కేటీఆర్ తదితర బీఆర్ఎస్ నాయకులకు సమయం వచ్చినప్పుడే తగిన గుణపాఠం చెప్పాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఈ సమయంలో జనసేన బిజెపితో కలవకుండా, ఒంటరిగా పోటీ చేయకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాంగ్రెస్ కి ఉపయోగపడాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవచ్చు. ఆ విధంగా కేసీఆర్ కు ఒక అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. జైల్లో ఉన్నా.. మైదానంలో ఉన్నా.. ఆట ఆటే. చంద్రబాబు నిర్ణయంతో తెలంగాణలో ఆట ఇప్పుడు మరో మలుపు తిరిగిందని చెప్పాలి.

Read Also : Telangana: బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌

Exit mobile version