Telangana: నష్టాన్ని అంచనా వేసేందుకు రంగంలోకి కేంద్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్

Telangana: తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై వ్యవసాయ పొలాలు దెబ్బతిన్నాయి.. .ఎంతో మంది నివాసం కోల్పోయారు. పలువురు మరణించారు. ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. తెలంగాణాలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి అధికారులు తెలంగాణాలో పర్యటించనున్నారు. సోమవారం జూలై 31 న తెలంగాణకు అధికార బృందం రానుంది. ఈ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు కునాల్ సత్యార్థి నాయకత్వం వహిస్తారు. ఇందులో వ్యవసాయం, ఆర్థికం, జలశక్తి, విద్యుత్, రోడ్డు రవాణా మరియు హైవేలు మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) మంత్రిత్వ శాఖలు ప్రతినిధులు ఉంటారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నిలిచిపోవడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి.

ఇదిలా ఉండగా ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆగస్టు 1వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read:Dhoni Sleep Video: విమానంలో ధోనీ కునుకు.. వీడియో వైరల్