Munugode Bypoll: నేటితో మునుగోడు ప్రచారానికి తెర..!

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో బంద్ కానుంది.

  • Written By:
  • Updated On - November 1, 2022 / 03:25 PM IST

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో బంద్ కానుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాజకీయ నేతల బహిరంగ ప్రచారానికి తెరపడనుంది. నెలరోజులు పాటు ఉధృతంగా సాగిన ఈ ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల హామీలతో గ్రామాలన్నీ చుట్టివచ్చారు. ఈ ఎన్నికలో గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు ప్రచారం చేశాయి. నవంబర్ 3న నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే కీలకమైన ఉప ఎన్నికలో 2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు.

ఉప ఎన్నికల ప్రచారం నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని, నవంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) వికాస్ రాజ్ సోమవారం ఇక్కడ తెలిపారు. ఈ బై ఎలక్షన్స్ బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 3,366 మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. సోమవారం సాయంత్రం వరకు రూ.6.80 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:  AP : శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు..!!

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డి తన కుటుంబానికి చెందిన సంస్థ ఖాతా నుంచి నియోజకవర్గంలోని 23 మందికి, సంస్థలకు రూ.5 కోట్లకు పైగా నగదు బదిలీ చేయడంపై ఈసీని వివరణ కోరగా.. అభ్యర్థి నుంచి కమిషన్‌కు సమాధానం వచ్చిందని తెలిపారు. పోల్ ప్యానెల్ ఈ విషయాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. రాజ్‌గోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన ఆయన మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే.. ఈ ఉప ఎన్నికల బరిలో తెరాస నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజ్‌ గోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు.