తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. సుప్రీంకోర్టు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయకపోవడంతో ప్రభుత్వం ఎదురుదెబ్బ తిన్నట్టైంది. ఈ పరిణామం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన చర్చా విషయంగా మారింది. హైకోర్టు తీర్పు కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడినందున, ఎన్నికలు ఆలస్యమవకుండా పరిష్కార మార్గాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది.
Dhanteras 2025: ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల అస్సలు కొనకండి.. కొన్నారో అంతే సంగతులు!
ప్రస్తుత సమాచారం ప్రకారం.. మంత్రుల్లో ఎక్కువమంది రేవంత్‌రెడ్డికి పార్టీ స్థాయిలోనే 42 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఎన్నికలకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కోర్టు ఆంక్షల పరిధిలో అధికారికంగా అమలు చేయలేకపోయినా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో బీసీ సమాజానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావన వ్యక్తమైంది. దీంతో చట్టపరమైన అడ్డంకులు లేకుండా బీసీ సమాజానికి న్యాయం చేయడమే కాకుండా రాజకీయంగా కూడా బలమైన సందేశం ఇవ్వాలనే వ్యూహం చర్చలోకి వచ్చింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా రేవంత్‌రెడ్డి పార్టీ అంతర్గతంగా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఇకపోతే, ఈ నెల 19న జరగబోయే టీపీసీసీ పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై తుది చర్చ జరగనుంది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని ఆధారంగా చేసుకొని, 23న మరోసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాలతో బీసీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజానికి చేసిన హామీలను ఎంతవరకు నెరవేర్చగలదో, కోర్టు పరిమితుల్లో ఎంతవరకు రాజకీయ వ్యూహం అమలు చేయగలదో అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.