Ministers Quarters: అక్కడా.. ఇక్కడా కాదు. ఏకంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో చోరీ జరిగింది. మినిస్టర్స్ క్వార్టర్స్ క్యాంపస్‌లో నిర్మాణ దశలోని కట్టడాల్లో ఉన్న నిర్మాణ సామగ్రిని కొందరు దొంగిలించారు. డోర్స్, స్టీల్ వంటి విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారని తెలిసింది. దీనిపై సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో(Ministers Quarters) భారీ భద్రత ఉంటుంది. అలాంటి చోటే దొంగతనం జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని తెలుస్తోంది. త్వరలోనే దొంగలను పట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
పిల్లల విక్రయ ముఠా గుట్టురట్టు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల విక్రయాలు జరుపుతున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను ఈ ముఠా చెర నుంచి మేడిపల్లి పోలీసులు విడిపించారు. ఫిర్జాదిగూడలో ఆర్‌ఎంపీ శోభారాణి సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పిర్జాదిగూడ రామకృష్ణ నగర్‌లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు సాగుతున్నాయి. ఈ ముఠా నిర్వాహకులు ఇప్పటివరకు మొత్తం 50 మంది పిల్లలను విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలను పోషించడం భారమంటూ తల్లులకు చెప్పి.. పిల్లలు లేనివారికి బాలలను దత్తత ఇస్తామంటూ నమ్మించి వారిని అమ్మేస్తున్నట్లు విచారణలో గుర్తించారు.