Site icon HashtagU Telugu

Budget: అన్ని వర్గాలవారికి బడ్జెట్‌ అండగా నిలిచింది: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

Budget

Budget

Budget: అసెంబ్లీలో ప్ర‌జా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Budget) రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా ఉందని ప‌ర్యాటక‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిందని, బీఆర్ఎస్ పాలకుల విధ్వంసాల నుంచి వ్యవస్థలను పునరుద్ధరింపజేసే దిశగా బడ్జెట్‌ను రూపొందించారని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్ర‌జా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టిందని, ఈ బడ్జెట్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసాని ఇచ్చేలా, అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉందన్నారు.

తెలంగాణ రైజింగ్ పేరుతో 2050 పాల‌సీ లక్ష్యాల‌కు అనుగుణంగా పథకాలు రూపొందించిన ఈ బడ్జెట్ అన్ని వర్గాల కలలను సాకారం చేస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వ్యవసాయ రంగానికి రూ. రూ. 24,439 కోట్లు, రైతు భ‌రోసాకు రూ. 18వేల కోట్లు కేటాయించడంతో రైతుల‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని అభిప్రాయపడ్డారు. సాగు నీటి రంగానికి రూ.23,373 కోట్లు కేటాయింపులు చేయ‌డం శుభపరిణామని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యంతో పాటు కాకుండా సబ్బండ వర్ణాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు.

Also Read: Sunita Williams Net Worth: సునీతా విలియ‌మ్స్ నికర సంపాద‌న ఎంతో తెలుసా?

మూలధన వ్యయాన్ని రూ.36,504 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులు పెరుగుతాయని, ప్రణాళికాబద్ధంగా రూపొందించిన ఈ బడ్జెట్‌లో సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చేసిన కేటాయింపులు ప్ర‌జా ప్రభుత్వ విధానాన్ని వెల్లడించాయని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల‌ హామీల అమలుకు బ‌డ్జెట్ లో తగిన కేటాయింపులు జరపడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమ‌ని పేర్కొన్నారు.

స్పష్టమైన విధానంతో, నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో తెలంగాణ‌లోని పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చే దిశగా నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని (2025-2030) రూపొందించామ‌ని వెల్ల‌డించారు. GSDP లో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచడం, రూ. 15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 3 లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం, తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే ల‌క్ష్యంగా ఈ పాలిసీని తీసుకువచ్చామ‌ని వివ‌రించారు. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్ లో పర్యాటక శాఖకు ఈ బడ్జెట్ లో 775 కోట్ల రూపాయలు ప్రతిపాదించార‌ని తెలిపారు.