KTR Vs ED : తనపై పసలేని కేసులు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తనకు ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనని ఆయన వెల్లడించారు. తనపై ఏసీబీ పెట్టిన కేసులో బలం లేదనే విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని వాదిస్తూ హైకోర్టులో క్వాష్ వేశాను.. తాను ఆశావాదినని కేటీఆర్ తెలిపారు. కోర్టులో ఏం జరుగుతుందో.. రేపు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ ఏసీబీ ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టి వేస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఇతర కేసుల్లో మాదిరిగా కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసులను లీగల్‌గానే ఎదుర్కొంటానని..వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు. ‘‘ఫార్ములా ఈ రేసుకు మంత్రి హోదాలోనే నేనే డబ్బులు కట్టమన్నాను. ప్రొసీజర్ ప్రకారం జరగకుంటే.. ఎలక్షన్ కవిషన్, ఆర్బీఐ దగ్గరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పోలేదు ? డబ్బులు ముట్టినవారిపై కేసులు ఎందుకు పెట్టలేదు ?’’ అని ఆయన ప్రశ్నలు సంధించారు.
Also Read :SpaDeX Mission : ఇవాళ రాత్రి ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’.. జంట శాటిలైట్లతో జబర్దస్త్ ఫీట్
ఫార్ములా ఈ రేస్ కంపెనీ ప్రతినిధులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదని కేటీఆర్(KTR Vs ED) ప్రశ్నించారు. వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు సీఎం రేవంత్ దాచి ఉంచారన్నారు. ఫార్ములా ఈ రేస్ కంపెనీ వాళ్ల నుంచి రేవంత్ డబ్బులు తీసుకున్నారనే అనుమానం తనకు ఉందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నాకు ముడుపులు ఎట్లా వచ్చినయో చెప్పాలి. అనుమానాలపైన కేసులు ఉండవు. కేవలం ఆధారాలపైన మాత్రమే కేసులు ఉంటాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నాపైన ఇప్పటికే అనేక కేసులను రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు నాపై వివిధ రకాల కేసులు పెట్టించి జైలుకు పంపాలని ప్రయత్నం చేసిండు’’ అని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డికి కాదు రేవంత్ రెడ్డి తాతకు కూడా భయపడనని కేటీఆర్ తేల్చి చెప్పారు.