Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న కొద్దీ రకరకాల ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌ను మాజీ మంత్రి హరీష్ రావు ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ బీఆర్ఎస్ హయాంలో డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తాజాగా ఇవాళ ఆయనను జూబ్లీహిల్స్ ఏసీపీ పిలిపించి మాట్లాడారు. ఫిర్యాదుతో ముడిపడిన మొత్తం సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేందుకు ఉన్న ఆధారాలను చూపించాలని చక్రధర్ గౌడ్‌ను కోరగా.. ఆయన కొన్ని ప్రూఫ్స్‌ను ఇచ్చినట్టు తెలిసింది. తాను వాడే యాపిల్ ఐఫోన్ ట్యాప్ అయినట్టుగా ఒక అలర్ట్ మెసేజ్(Phone Tapping Case) వచ్చిందని చక్రధర్ తెలిపారు. దాని వివరాలను గతంలో పోలీసులకు ఇచ్చానన్నారు. ఆనాడు పోలీసులు తనను రెండుసార్లు పిలిపించి గంటల కొద్దీ విచారణ జరిపి, స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. తన ఫోన్‌తో పాటు తన భార్య, డ్రైవర్, ఇతర కుటుంబ సభ్యుల ఫోన్లను బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ చేశారని చక్రధర్ తెలిపారు.
Also Read :Digital Real Estate : ‘డిజిటల్ రియల్ ఎస్టేట్’ వ్యాపారం గురించి తెలుసా ?
‘‘అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు నన్ను బెదిరించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి హరీష్ రావుకు సరెండర్ కావాలని సూచించారు. లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరించారు’’ అని చక్రధర్ గౌడ్ ఇవాళ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట వాపోయారు. చెప్పినట్లు వినకపోతే.. కుటుంబాన్ని అంతం చేస్తామని నాటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు బెదిరించారని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నానని, న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేస్తానని చక్రధర్ గౌడ్ వెల్లడించారు. మొత్తం మీద బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావుపై మరోసారి చక్రధర్ గౌడ్ చేసిన ఆరోపణలతో రాజకీయ వేడి రాచుకుంది.