బిఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లను , ఆఫీస్ లతో పాటు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని (Telangana Bhavan) కూల్చబోతున్నారా..? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. హైదరాబాద్ (Hyderabad) లో ట్రాఫిక్ సమస్య (Traffic Problem) ఎలా ఉంటుందో తెలియంది కాదు..ఎన్ని ఫ్లైఓవర్స్ , ఎన్ని అండర్ పాస్ బ్రిడ్జ్ లు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సమస్య మాత్రం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పునాదులు వేసింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ప్రధానంగా ఎంచుకుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎక్కడ ఫ్లైఓవర్లు నిర్మించాలనే అంశంపై సర్వే ప్రారంభమైంది. సర్వే ప్రకారం, నిర్మాణానికి అవసరమైన ప్రాంతాల్లో మార్కింగ్ మొదలైంది. ఈ ప్రణాళికలో ముఖ్యంగా ఫ్లైఓవర్‌ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణతోపాటు, నివాసాలు, ఆస్తులపై ప్రభావం పడే అవకాశముందని తెలుస్తోంది.
భూసేకరణలో ప్రభావితమయ్యే ఆస్తులు :
ఫ్లైఓవర్ల కోసం చేపట్టిన భూసేకరణ వల్ల సుమారు 350 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 90 నివాసాలకు మార్కింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆసక్తికరంగా, ఈ జాబితాలో కొంత మంది రాజకీయ నాయకుల ఇళ్లు, సినీ ప్రముఖుల ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఇల్లు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, అల్లు అర్జున్ మామ వంటి ప్రముఖుల ఇళ్లు కూడా మార్కింగ్ చేసినట్లు సమాచారం. వీరితో పాటు అరడజను మంది బీఆర్ఎస్ నేతల ఇళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాగ్జిమమ్ ఇళ్లు కూల్చిపోవడం కాకుండా పార్కింగ్ ప్రాంతాలను తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే, కూల్చివేతలు తప్పనిసరి అయితే ఆయా నాయకులతో చర్చలు జరుపుతామని తెలుస్తోంది. అధికారుల అంతర్గత సర్వే ప్రకారం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ కూడా ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల సగం కూల్చివేతకు పోయే అవకాశముంది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. ఫ్లైఓవర్ల నిర్మాణం పేరుతో ఇళ్ల కూల్చివేతల అంశం రాజకీయంగా దుమారం రేగించవచ్చు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Also : My Panchayat app : సర్టిఫికెట్ల కోసం తెలంగాణ సర్కార్ సరికొత్త యాప్