MLC Kavitha : జులై 25 వరకు కవిత, సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  

  • Written By:
  • Updated On - July 3, 2024 / 01:31 PM IST

MLC Kavitha :ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితలకు మరోసారి  కోర్టు‌లో చుక్కెదురైంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జులై 25 వరకు పొడిగించింది. బీఆర్‌ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కూడా జులై 25 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఇవాళ ఉదయం ఈ ఇద్దరు నేతలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు కీలక దశలో ఉన్నందున వీరిద్దరిని జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టును కోరాయి. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 25 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కున్న కల్వకుంట్ల కవిత(MLC Kavitha) బయటకు వచ్చేలా కనిపించడం లేదు. ఆమె ఈనెల 25 వరకైతే జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. మార్చి 15 న లిక్కర్ స్కాం కేసులో కవిత ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు కవితపై సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ఈడీ, సీబీఐలు గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్ రాకుండా అడ్డుకున్నాయి. కోర్టులో వాదనలు వినిపించిన ప్రతిసారీ ఈడీ, సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో కవిత పాత్రపై కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.

మహిళ అనే కారణంతో కవితపై సానుభూతిని చూపించలేం : హైకోర్టు 

ఈడీ, సీబీఐ కేసులకు సంబంధించి కవిత పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ఈ నెల 1న కూడా ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతిని చూపించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యావంతురాలు, పలుకుబడి కలిగిన మహిళ అయి ఉండి కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని కవిత గుర్తుంచుకోవాలని కోర్టు బెంచ్ కామెంట్ చేసింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాల ఆధారంగా కవితకు బెయిల్ మంజూరు చేయాలా ? వద్దా ? అనేది డిసైడ్ అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.  ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలోని ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరని.. ఈమేరకు ఈడీ సాక్ష్యాలను కూడా సేకరించిందని తెలిపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు కవిత తరఫునే పనిచేశారని దర్యాప్తులో వెల్లడైందని చెప్పింది. అందుకే ఈ కేసులో కవితను నిస్సహాయ మహిళగా పరిగణించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకే ఆమె బెయిల్ పిటిషన్లను తాము తోసిపుచ్చాల్సి వస్తోందని పేర్కొంది.

Also Read :Elderly Person Killed : ఘట్​కేసర్​లో రైలుకు వేలాడుతూ గుర్తు తెలియని వ్యక్తి..