Congress Operation Akarsh: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా పడిపోయిన గులాబీ పార్టీ లోకసభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. దీంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు గేట్లు తెరవడంతో నేతలు వరుసగా హస్తం పార్టీలోకి క్యూ కడుతున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ లాంటి మహా నగరంలో పార్టీ బలహీన పడుతుంది.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల సమస్యతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్, ఇప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరడంతో నగర పరిధిలో నేతలు, క్యాడర్‌ను కోల్పోతున్నారు. మరికొందరు వాళ్ళ బాటలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు. ‘ఆషాడ మాసం’ సందర్భంగా ఆ పార్టీ నేతల వలసలు కొంతకాలం నిలిచిపోయినా ఇప్పుడు ‘శ్రావణ మాసం’లో అధికార కాంగ్రెస్‌లో చేరాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కార్పొరేటర్లను, మరోవైపు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. వారు కారు దిగుతారనే నమ్మకం ఉంది. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు ఇటీవలే కాంగ్రెస్‌లోకి మారారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు బలపడాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలో నగర నేతలను ఆకర్షించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. పౌర సంఘం పదవీకాలం ఫిబ్రవరి-మార్చి 2026లో ముగుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినంది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.దీంతో బల్దియా ఎన్నికల్లో కారు పార్టీకి బ్రేకులు ఫెయిల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
నగర నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడటం గులాబీ పార్టీని కలవరపెడుతోంది. ఇప్పటికే దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ సహా కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. బీఆర్‌ఎస్‌తో ఉన్న కొందరు నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌తో కనిపిస్తున్నారు. మాజీ కార్పొరేటర్లు సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌లోకి మారారు.