BRS Meeting : బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్! కేసీఆర్ ఖ‌మ్మం స‌భ అల‌జ‌డి!

పువ్వాడ‌,నామా నాగేశ్వ‌ర‌రావును ఖ‌మ్మం బీఆర్ఎస్ న‌మ్ముకుంది.

  • Written By:
  • Updated On - January 9, 2023 / 01:55 PM IST

మంత్రి పువ్వాడ‌, ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావును మాత్ర‌మే ప్ర‌స్తుతం ఖ‌మ్మం బీఆర్ఎస్ న‌మ్ముకుంది. ఈనెల 18వ తేదీన కేసీఆర్ బ‌హిరంగ స‌భ(BRS Meeting) నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను వాళ్ల‌కే అప్ప‌గించారు. వాళ్లిద్ద‌రితో నేరుగా కేసీఆర్(KCR) మాట్లాడి కో ఆర్డినేట్ చేయాల‌ని సూచించిన‌ట్టు తెలుస్తోంది. అంటే, ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి దూరం జ‌రిగిన‌ట్టే. ఖ‌మ్మం జిల్లా బీజేపీ రాజ‌కీయాన్ని మ‌లుపు తిప్ప‌డానికి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి సిద్ధయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స‌భ (BRS Meeing) జరిగే 18వ తేదీన అదే జిల్లా నుంచి బీఆర్ఎస్ కు పెద్ద గండి ప‌డ‌నుంది. ఆ రోజు ఢిల్లీ వెళ్లి అమిత్ షా స‌మ‌క్షంలో పొంగులేటి బీజేపీ గూటికి చేర‌నున్నారు.

18వ తేదీన కేసీఆర్ బ‌హిరంగ స‌భ(BRS Meeting)

గ‌త కొంత కాలంగా తుమ్మ‌ల‌, పొంగులేటి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. వాళ్లిద్ద‌రూ జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన పోటాపోటీగా ఆత్మీయ విందుల‌కు అనుచ‌రుల‌ను ఆహ్వానించారు. గృహ‌ప్ర‌వేశం అంటూ విందుకు త‌మ్మల ఆహ్వానం ప‌లికారు. కొత్త ఏడాది ఫంక్ష‌న్ త‌ర‌హాలో పొంగులేటి విందు రాజ‌కీయాన్ని పండించారు. ఇటీవ‌ల ఆయ‌న కుమార్తె వివాహానికి బీజేపీ నేత‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. బీఆర్ఎస్ నేత‌లు ఎవ‌రూ ఆ వేడుక‌లో క‌నిపించ‌లేదు. దీంతో అప్ప‌టి నుంచే బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ల‌బోతున్నార‌ని ప్ర‌చారం ఊపందుకుంది. లాంఛ‌నంగా ఈనెల 18వ తేదీన ఆయ‌న బీజేపీ కండువా క‌ప్పుకోనున్నారు. ఇక‌, మాజీ మంత్రి తుమ్మ‌ల ఎటు అనేది టీడీపీ, బీజేపీ పొత్తు మీద ఆధార‌ప‌డి ఉంది.

 Also Read : NTR: ఎన్టీఆర్​ ప్రజా పట్టాభిషేకానికి నేటికి 40 ఏళ్లు!

వాస్త‌వంగా పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయ అనుచ‌రుడు. ఇటీవ‌ల రెండుసార్లు తాడేప‌ల్లికి వెళ్లి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. భ‌విష్య‌త్ రాజ‌కీయ అడుగుల గురించి వాళ్లిద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు ఆ రెండు సంద‌ర్భాల్లోనూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న్ను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ల‌డానికి అనుమ‌తించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా బీజేపీలోకి వెళ్ల‌డానికి దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, పాలేరు నుంచి పోటీ చేయ‌డానికి ష‌ర్మిల సిద్ధమ‌య్యారు.ఆ మేర‌కు ఆఫీస్ ను కూడా పాలేరు వద్ద ష‌ర్మిల ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవ‌ల ఆమె పాద‌యాత్ర‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఆమె అనుచ‌రులు, వాహ‌నాల మీద దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఆ రోజు నుంచి పాద‌యాత్ర తిరిగి ప్రారంభం కాలేదు. పాలేరు వ‌ద్ద ఆమె రాజ‌కీయ పావులు క‌దుపుతున్నారు.

ప్ర‌త్యామ్నాయం దిశ‌గా తుమ్మ‌ల

మాజీ మంత్రి త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు వ్య‌తిరేకంగా తెర వెనుక ష‌ర్మిల‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజ‌కీయ పావులు క‌దిపార‌ని తెలుస్తోంది. అసెంబ్లీ ప‌రంగా పాలేరు నుంచి ష‌ర్మిల‌, ఖ‌మ్మం బీజేపీ ఎంపీగా పొంగులేటి పోటీ చేస్తార‌ని స‌మాచారం. అదే అసెంబ్లీ నియోక‌వ‌ర్గం నుంచి త‌మ్మల కూడా పోటీ చేయ‌డానికి చాలా కాలంగా గ్రౌండ్ త‌యారు చేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సిట్టింగ్ ల‌కు అవ‌కాశం ఇస్తాన‌ని కేసీఆర్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన క్ర‌మంలో ప్ర‌త్యామ్నాయం దిశ‌గా తుమ్మ‌ల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకే, ఈనెల 18వ తేదీన ఖ‌మ్మం వేదిక‌గా జ‌రిగే బహిరంగ స‌భ బాధ్య‌త‌ల‌ను పువ్వాడ‌, నామాకు అప్ప‌గించారు కేసీఆర్(KCR). ప‌రోక్షంగా బీజేపీతో నామా కూడా ట‌చ్ లోకి వెళ్లార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఖ‌మ్మం వేదిక‌గా బీఆర్ఎస్ ప‌రిస్థితి ఏమిటో కేసీఆర్ బ‌హిరంగ స‌భ ద్వారా తెలియ‌నుంది.

Also Read : BRS Delhi : సంక్రాంతి త‌రువాత కేసీఆర్ ఆట‌! ఢిల్లీ ఆర్భాటం, కేసుల గంద‌ర‌గోళం!