TG Assembly : ఇవాళ ఉదయం తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ‘‘అదానీ, రేవంత్ భాయ్ భాయ్’’ అంటూ వారి ఫొటోలతో ముద్రించిన టీ షర్టులను ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ లోపలికి వెళ్తేందుకు ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీలో తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది. ఆ టీ షర్టులను తీసేసి లోపలికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంపిన టీషర్ట్’’ అని ఈసందర్భంగా కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దుర్మార్గపు చర్య. తెలంగాణ ప్రజల సమస్యలు, రేవంత్- అదానీ వ్యవహారంపై అసెంబ్లీ, శాసన మండలిలో(TG Assembly) ప్రభుత్వాన్ని నిలదీస్తాం. హైడ్రా, మూసీతో పాటు వివిధ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం’’ అని కేటీఆర్ వెల్లడించారు.
అసెంబ్లీలోకి వెళ్లకుండా..
ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను పోలీసులు అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడే వారు నిరసనకు దిగారు. ‘ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం.. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ’ అంటూ కేటీఆర్ సహా నేతలంతా నినదించారు. టీషర్టులను తీసివేసేందుకు నిరాకరించడంతో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేశారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద కేటీఆర్, హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా అమరవీరులను కీర్తిస్తూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాట పాడారు. ఈ సమయంలో కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా దేశపతి పాటను అనుసరిస్తూ నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు.
Also Read :Manoj Vs Vishnu : టెన్షన్ టెన్షన్.. మనోజ్ ఇంటి చుట్టూ మంచు విష్ణు ప్రైవేటు బౌన్సర్లు
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఏడు చట్ట సవరణ బిల్లులను ఈసారి అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.