Site icon HashtagU Telugu

YS Sharmila : అయ్యో ష‌ర్మిల‌.. కేసీఆర్‌, కేటీఆర్‌పై నిత్యం ఘాటు విమ‌ర్శ‌లు.. ప‌ట్టించుకోని బీఆర్ఎస్‌

BRS KCR and KTR even not responding to YS Sharmila comments

BRS KCR and KTR even not responding to YS Sharmila comments

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అద్య‌క్షురాలు వై.ఎస్‌. ష‌ర్మిల(YS Sharmila) దూకుడుగా రాజ‌కీయాలు చేస్తున్నారు. తెలంగాణ‌లో అధికార పార్టీ బీఆర్ఎస్(BRS) పై విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. ష‌ర్మిల పాద‌యాత్ర స‌మ‌యంలో బీఆర్ఎస్ వ‌ర్సెస్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న‌ట్లు రాజ‌కీయాలు సాగాయి. పాద‌యాత్ర స‌మ‌యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌పై ష‌ర్మిల‌ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ప‌లుసార్లు ఆమె కాన్వాయ్‌పై దాడులు సైతం జ‌రిగాయి. పోలీసులు(Police) ఆమెను అరెస్టు సైతం చేశారు. ప‌లుకార‌ణాల‌తో పాద‌యాత్ర ఆగిపోయింది. ఆ త‌రువాత‌కూడా ష‌ర్మిల నిత్యం సీఎం కేసీఆర్‌(KCR), కేటీఆర్(KTR) ల‌పై పెద్ద దొర‌, చిన్న‌దొర అంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గ‌త‌కొద్దిరోజులుగా విమ‌ర్శ‌ల‌ తీవ్ర‌త‌ను ష‌ర్మిల మ‌రింత పెంచారు.

తెలంగాణ రాజ‌కీయాల్లో నిత్యం హాట్‌టాపిక్‌గా నిలిచేలా ష‌ర్మిల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న వ్య‌తిరేకత‌ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ పై నిత్యం విమ‌ర్శ‌ల‌కు దిగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒకానొక స‌మ‌యంలో తెలంగాణలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత‌లుసైతం ష‌ర్మిల‌లా సీఎం కేసీఆర్‌, కేటీఆర్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం లేద‌న వాద‌న సైతం ఉంది. రెండు రోజుల క్రితం.. ద‌ళారి దొంగ‌లు, కొత్త వేష‌గాళ్లు, దోపిడీదారులు అంటూ దొర మాట్లాడుతుంటే.. దొంగ‌లే భుజాలు త‌డుముకున్న‌ట్లు ఉందంటూ ష‌ర్మిల ట్విట‌ర్ వేదిక‌గా కేసీఆర్‌, కేటీఆర్ పై విమ‌ర్శ‌ల చేశారు. పూట‌కో మాట‌, గ‌డికో హామీ అంటూ మ‌స్త్ మాట‌లు చెప్పే అస‌లైన ప‌గ‌టి వేష‌గాడు కేసీఆర్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తాజాగా ష‌ర్మిల కేసీఆర్‌, కేటీఆర్‌ల పై మ‌రోసారి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఈసారి కాంగ్రెస్ ను వెనుకేసుకొస్తూ వారిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలివిలేనోళ్లు కాంగ్రెసోళ్ళయితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొన్న మీది అతితెలివి కాదా చిన్న దొర..!కాంగ్రెస్ నేతలు చేతకాని దద్దమ్మలు అయితే 2014లో ఆరుగురిని కొన్న మీరు పెద్ద దద్దమ్మలు కారా అంటూ ప్ర‌శ్నించారు. ప్రతిపక్ష లీడర్లు ఎన్నికల సమయంలోనే కనిపించే సంక్రాంతి గంగిరెద్దులైతే.. ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచిన కుంభకర్ణుడు కేసీఆర్ కాదా అంటూ ప్ర‌శ్నించారు.

అయితే, ప‌లుసార్లు ష‌ర్మిల కేసీఆర్‌, కేటీఆర్ ల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసినా బీఆర్ఎస్ నేత‌లు కౌంట‌ర్ వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, ఆఖ‌రికి టీడీపీ నేత‌లు కేసీఆర్‌, కేటీఆర్ పై విమ‌ర్శ‌లు చేసినా వెంట‌నే ప్రెస్‌మీట్‌లు పెట్టి కౌంట‌ర్ విమ‌ర్శ‌లు చేసే బీఆర్ఎస్ నేత‌లు.. ష‌ర్మిల విష‌యంలో ఎందుకు అలా చేయ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌లు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ కు అభిమానుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. వైఎస్ఆర్ కుమార్తె అయిన ష‌ర్మిల‌ను విమ‌ర్శిస్తే వైఎస్ఆర్ అభిమానులు ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకి దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని, అందుకే అదిష్టానం సూచ‌న‌ల మేర‌కు బీఆర్ఎస్ నేత‌లు ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌టం లేద‌న్న వాద‌న వినిపిస్తున్నాయి. మొత్తానికి ష‌ర్మిల ఎన్ని విమ‌ర్శ‌లు బీఆర్ఎస్ నేత‌లు విన‌ప‌డ‌న‌ట్లు న‌టిస్తున్నారంటూ ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు సైతం చేస్తున్నారు.

 

Also Read : Bjp New Alliances : 2024లో కొత్త “పొత్తు” పొడుపులు..బీజేపీకి న్యూ ఫ్రెండ్స్