Site icon HashtagU Telugu

MLA Defection Case: హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌కు చెంపపెట్టు: బీఆర్ఎస్

MLA Defection Case

MLA Defection Case

MLA Defection Case: హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు స్పందించిన హరీష్ రావు హైకోర్టు ఉత్తర్వ్యూలను స్వాగతించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై చర్య తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) సోమవారం ఇచ్చిన ఆదేశాలను బీఆర్‌ఎస్ స్వాగతించింది. హైకోర్టు తీర్పు అధికార కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.

“ఈ తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామిక పద్ధతులకు ఎదురుదెబ్బ. పార్టీ మారిన వారు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని స్పష్టంగా తెలియజేస్తోంది. న్యాయస్థానం తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం” అని ఆయన అన్నారు. కాగా ఆ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమని, బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, కోర్టు ఆదేశాలను అనుసరించి శాసనసభ స్పీకర్ వెంటనే చర్యలు తీసుకుంటారని మేము విశ్వసిస్తున్నాము అన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై(MLA Defection Case) అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ప్రకటించాలని జస్టిస్ బి. విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. బీఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై గత నెలలో ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచిన కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు తెల్లం, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లపై దాఖలైన అనర్హత పిటిషన్‌ల పరిశీలనకు సంబంధించి స్పీకర్‌ చర్య తీసుకోకపోవడంపై రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి.

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై స్పీకర్ నిర్ణయాన్ని మూడు నెలలుగా పెండింగ్‌లో ఉంచుతున్నారని పిటిషనర్లు వాదించారు. అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి కోర్టుకు ఉన్న అధికారాలకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలపై సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.

Also Read: UPI Fraud Gang Arrested : తెలంగాణలో యూపీఐ స్కాం.. బజాజ్ షోరూంలకు కుచ్చుటోపీ పెట్టిన ముఠా