BRS Defecting MLAs: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై ఇవాళ (బుధవారం) సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఈ కేసుతో ముడిపడిన ముఖ్య అంశాలపై న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం వల్ల తెలంగాణలో ఉప ఎన్నికలు రావు’’ అని గత బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను గవాయ్ తప్పుపట్టారు. ‘‘పవిత్రమైన చట్టసభ వేదికగా సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందికే వస్తుంది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సీఎంకు హితవు చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మాటలను మేం ఉపేక్షించబోం. అవసరమైతే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి జస్టిస్ గవాయ్ నిర్దేశించారు. ‘‘మేం అన్నీ ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తుంటాం. అసెంబ్లీలు వేదికగా నాయకులు చేసే ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. అందుకే అక్కడ మాట్లాడే అంశాలను కోర్టులు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని ఆయన చెప్పారు.
Also Read :Telecom Network Maps: మీ ఏరియాలో సిగ్నల్ ఉందా? కవరేజీ మ్యాప్స్ ఇవిగో
సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఇవీ..
గత బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్(BRS Defecting MLAs) ప్రసంగిస్తూ.. ‘‘తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి ? ’’ అని కామెంట్స్ చేశారు.
Also Read :Betel Leaves : తమలపాకు, మణిపూసల మాలలకు జీఐ ట్యాగ్.. ఎందుకు ?
చేతులు కట్టుకొని కూర్చోవాలా.. ప్రశ్నించిన జస్టిస్ గవాయ్
ఇవాళ ఈ కేసుపై విచారణ జరిపే క్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కోర్టులు ఇక చేతులు కట్టుకొని కూర్చోవాలా అని ప్రశ్నించారు.గతంలో కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోర్టులో నిలబెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగంలో షెడ్యూల్-10 ఉండగా, ఫిరాయింపుల విషయంలో ఎలాంటి చర్య తీసుకోకపోతే, అది రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లే అవుతుందన్నారు. తమ నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తామని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.