Warangal: వరంగల్ లో బీఆర్ఎస్ మనుగడ కష్టమేనా

Warangal: వరంగల్ ప్రాంతం కేసీఆర్ అడ్డాగా మారిన సందర్భంలో పట్టణం గులాబీ జెండాలతో నిండిపోయింది. గత ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ జెండా కాదు కదా నాయకులే కరువవుతున్నారు. మరోసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వరంగల్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో గానీ, కాంగ్రెస్‌లో గానీ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు అరూరి రమేష్ బీజేపీలో చేరడంపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. పార్టీ అధిష్టానం తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రమేష్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ అగ్రనేతలతో రమేష్ టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. వరంగల్ అభివృద్ధికి నిధుల విడుదల కోసమే మేయర్ సీఎంను కలిశారని చెప్పినా.. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. రెండు నెలల్లో సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు దాదాపు 15 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సిద్దమైనట్లు తెలుస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ నాయకత్వం వరంగల్ పై ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు.

Also Read: PM Modi : ప్రధాని మోడీకి సీఎం రేవంత్ 11 విజ్ఞప్తులు