పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ (Telangana) లో మరోసారి అధికార పార్టీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress- BRS) మధ్య వార్ మొదలైంది. కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ నల్లగొండ నగరంలో ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ సభ పెట్టబోతున్నారు. దీనికి సంబదించిన దిశా నిర్దేశాలు నిన్న తెలంగాణ భవన్ లో నేతలకు చేసారు. ప్రాజెక్టులను KRMBకి అప్పగించడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాలను వివరించేలా సభ ఉంటుందని కేసీఆర్ వారికి వివరించారు. పదేళ్లుగా ప్రాజెక్ట్ లను కేంద్రం చేతిలో పెట్టలేదని , కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్ట్ లను కేంద్రం చేతిలో పెట్టి చేతులు దులుపుకుందని కేసీఆర్ విమర్శించారు.
We’re now on WhatsApp. Click to Join.
నల్గొండలో సభ పెట్టే ముందు… కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టులకు కేఆర్‌ఎంబీ తాము అప్పగించలేదని… బీఆర్‌ఎస్ హయాంలో అప్పగించారని అంటున్నారు. ప్రాజెక్టును అప్పగిస్తూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేసిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు. బీఆర్‌ఎస్ కావాలనే కాంగ్రెస్‌పై అబద్దపు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. బీఆర్‌ఎస్‌కు పోటీగా నల్గొండలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న (మంగళవారం) సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కూడా ఈ విషయంపై చర్చించారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. పార్లమెంట్ ఎన్నికల ముందు… ప్రజల్లో వ్యతిరేకత రాకముందే.. బీఆర్‌ఎస్‌కు ధీటుగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సభ కు ప్రియాంక గాంధీ ని ఆహ్వానించాలని అనుకుంటున్నారు. అలాగే అదే సభలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే హామీలపై కూడా ప్రకటన చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. మరి ఈ సభ ఎప్పుడు పెడతారో చూడాలి. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఇరు పార్టీలలో జోరు పెంచింది.
Read Also : AP DSC Notification : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..