Indira Canteens: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 5కే నిరుపేదలకు అల్పాహారం అందించాలని సంకల్పించింది. ఇందుకోసం కావాల్సిన అనుమతలను సైతం జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లు (Indira Canteens)గా పేరు మార్చాలని, రూ.5 భోజనంతో పాటు కొత్తగా అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం జూన్ 26న జరిగిన GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ పథకం కింద 139 ప్రాంతాల్లో నిర్మాణాలను పునరుద్ధరించి ఇందిరా క్యాంటీన్లుగా ఏర్పాటు చేయనున్నారు. పట్టణ పేదలకు మరింత సౌలభ్యం కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Kannappa Movie Talk: కన్నప్ప మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే!
2014లో హరే కృష్ణ ఛారిటీస్ సహకారంతో ప్రారంభమైన అన్నపూర్ణ భోజన కేంద్రాలు, రూ.5కే భోజనం అందించడం ద్వారా పేదలు, రోజువారీ కూలీలు, అవసరమైన వారికి సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాలు ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల భోజనాలను అందించాయి. ఇప్పుడు, ఈ కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా రీబ్రాండ్ చేస్తూ, రూ.5 భోజనంతో పాటు అల్పాహారం కూడా రూ.5కే అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త పథకం నగరంలోని కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాలకు మరింత పోషకాహార సౌలభ్యం అందించేందుకు ఉద్దేశించబడింది.
GHMC ప్రణాళిక ప్రకారం 11 ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న శాశ్వత సీటింగ్ సౌకర్యాలతో కూడిన కేంద్రాలను పునరుద్ధరించనున్నారు. అదనంగా 40 ప్రాంతాల్లో 40×10 అడుగుల, 99 ప్రాంతాల్లో 20×10 అడుగుల నిర్మాణాలను నిర్మించి మొత్తం 139 కొత్త ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను హరే కృష్ణ ఛారిటీస్ సహకారంతో కొనసాగించనున్నారు. వీరు రోజూ వేలాది భోజనాలను అందిస్తున్నారు. సీఎం రేవంత్ ఈ చొరవతో పేదలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.