Bomma Mahesh Kumar Goud as the President of Telangana PCC : తెలంగాణ నూతన పీసీసీ చీఫ్‌గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన నేతకు కీలక పదవి అప్పగించింది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ మధ్య పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రమైన పోటీ..
ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy) పదవీకాలం పూర్తైంది. కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ మధ్య పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రమైన పోటీ ఉంది. అయితే అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది. పార్టీలో అందరిని సమన్వయం చేస్తారని మహేష్ కుమార్ గౌడ్ కు పేరుంది.
ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఇటీవల ఢిల్లీ వేదికగా ప్రత్యేకంగా చర్చించారు. ఈ చర్చలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చి.. మహేశ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.
బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ నేపథ్యం..
కాగా, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.
మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితులయ్యారు.