Site icon HashtagU Telugu

Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి  గైర్హాజరు

Bln Reddy Ed Formula E Race Case Ktr Acb

Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలిరోజు(జనవరి 2) విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి  గైర్హాజరయ్యారు.  ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత టైం ఇవ్వాలని కోరుతూ ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఆయన  ఒక లేఖను ఈమెయిల్ ద్వారా పంపారు. బీఎల్ఎన్ రెడ్డి అభ్యర్థనకు ఈడీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరోరోజు విచారణకు పిలుస్తామని బీఎల్ ఎన్ రెడ్డికి ఈడీ బదులిచ్చింది. ఇదే కేసులో రేపు (శుక్రవారం రోజు) అరవింద్‌కుమార్‌ విచారణకు హాజరుకావాల్సి ఉంది. జనవరి 7న ఈడీ ఎదుటకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  విచారణకు హాజరు కావాల్సి ఉంది. తమ న్యాయవాదుల సూచన మేరకు ఈడీ విచారణకు హాజరు కావాలో లేదో నిర్ణయం తీసుకుంటానని కేటీఆర్ ఈ నెల 1న మీడియాకు తెలిపారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) నిధులను ఫార్ములా ఈ రేస్ నిర్వహించే విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారనే అభియోగాన్ని ఈడీ నమోదు చేసింది. నిధుల బదిలీ అంశంలో చోటుచేసుకున్న ఉల్లంఘనలపైనే బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్‌లను ఈడీ ప్రశ్నిస్తుందని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లను ఓ విదేశీ కంపెనీకి  చెల్లించిన అంశంతో ముడిపడిన అన్ని పత్రాలను తెలంగాణ ఏసీబీ ఇప్పటికే ఈడీకి(Formula E Race Case) అప్పగించింది.  బీఆర్ఎస్ హయాంలో సీఎం నుంచి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ టైమ్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు.