TG Municipal : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కేవలం కొన్ని గంటల సమయం ఉందనగా, నారాయణపేట జిల్లా మక్తల్‌లో చోటుచేసుకున్న విషాదం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు (చందాపూర్) బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ (48) తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహాదేవ్, మరణానికి ముందు రోజు వరకు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారని, అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా తనువు చాలించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో మక్తల్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాజకీయ వేధింపులే కారణమా?
మహాదేవ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు మరియు బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులు తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని వారు వాపోతున్నారు. నామినేషన్ వేసిన నాటి నుండి ప్రత్యర్థులు ఫోన్లలో బెదిరించడం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం ద్వారా మహాదేవ్‌ను మానసిక క్షోభకు గురిచేశారని భార్య సత్తెమ్మ ఆరోపించారు. ముఖ్యంగా బలవంతంగా కాంగ్రెస్‌లో చేర్చుకోవడం, తిరిగి ఆయన బీజేపీలోకి రావడంతో కక్షగట్టి వేధించారనే కోణంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మండిపడుతోంది.
దర్యాప్తులో తేలాల్సిన వాస్తవాలు
మరోవైపు, ఈ ఘటనపై మక్తల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా లేక రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఈ ఆరోపణలపై ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఎన్నికల వేళ జరిగిన ఈ విషాద ఘటన ఓటర్ల తీర్పుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా, ఒక గిరిజన అభ్యర్థి ఇలా ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Rahul Gandhi, CM Revant Reddy & Congress party are responsible for the tragic death of Erukala Mahadevappa, BJP’s Ward-6 candidate from Makthal — a son of a humble Scheduled Tribe family who dared to stand up for democracy. His death has shaken the conscience of Telangana.… pic.twitter.com/JwF3ASL22e
— BJP Telangana (@BJP4Telangana) February 10, 2026
